విధాత, వరంగల్ ప్రతినిధి: కగార్ ఆపరేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న మావోయిస్టుల ఎన్ కౌంటర్ లన్నింటిపైనా న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్ తో కలిసి శ్రీనివాసరావు మాట్లాడారు. కగార్ ఎన్ కౌంటర్ లపై అనేక అనుమానాలు ఉన్నాయని, మావోయిస్టుల ఎన్ కౌంటర్ లను స్వయంగా సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మావోయిస్టులను కోర్టుకు సరెండర్ చేయకుండా టెర్రరిస్టుల మాదిరిగా కేంద్ర ప్రభుత్వం భావించడం సరికాదని అన్నారు.
మావోయిస్టులు కూడా పంథా మార్చుకోవాలి
మావోయిస్టులు కూడా పునరాలోచన చేయాలని, తమ పంథాను మార్చుకోవాలని శ్రీనివాసరావు కోరారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదని ఇప్పటికే కొందరు బయటికి వచ్చారని, మిగిలిన వారు కూడా తమ పంథాను మార్చుకొని కమ్యూనిస్టులతో కలిసి రావాలని కోరారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం నరహంతక పాలన సాగిస్తున్నదని, కేవలం కార్పొరేట్, పెట్టుబడిదారీ శక్తుల కోసమే పని చేస్తున్నదని అన్నారు. ఇటీవల ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీకి చెందిన రూ. 33వేల కోట్లను ఆదానీ గ్రూపులో పెట్టుబడి పెట్టడమే ఇందుకు నిదర్శనం అన్నారు. ప్రజలు సంక్షేమాన్ని విస్మరించి పాలన చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా పోరాడేందుకు వామపక్ష ప్రజాతంత్ర శక్తులు బల పడాలని అన్నారు. అందుకోసం కమ్యూనిస్టులతో మావోయిస్టులు కూడా కలిసి రావాలని కోరారు.
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్ష పార్టీలను ముఖ్యమంత్రి డిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇందుకు బాధ్యత వహించాలని, కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ మాట్లాడుతూ వచ్చేే డిసెంబర్ 26 నాటికి సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ బస్సు జాతాలను నిర్వహిస్తున్నదని చెప్పారు. డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే వందేళ్ల సభకు వేలాదిగా తరలి రావాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర కార్యదర్శి సభ్యురాలు నేదునూరి జ్యోతి, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, మారుపాక అనిల్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
