Mexican Drug Lord Oseguera | జెలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అనే కరడుగట్టిన డ్రగ్ మాఫియా అధిపతి. నెమెసియో ఒసేగేరా సెర్వాంటెస్! అతడి చుట్టూ ఆర్మీ స్థాయిలో సాయుధ రక్షణ దళాలు మోహరించి ఉంటాయి. అతడిపై ఈగ వాలినా మరుక్షణం అది రాలిపోతుంది. కానీ.. తిరుగులేని టిప్ ఒకటి మెక్సికన్ స్పెషల్ ఫోర్సెస్‌కు అందింది. అతడు పశ్చిమ జెలిస్కో రాష్ట్రంలోని తపల్పా అనే గ్రామీణ ప్రాంతంలో ఉన్నాడని దాని సారాంశం. ఇది ఒక సుందరమైన, ప్రకృతి అందాలతో నిండిన గ్రామం. పర్యాటకులు తరచూ సందర్శించే ఏరియా. పక్కా సమచారం అందడంతో సిద్ధమైన నేషనల్ గార్డ్స్‌కు చెందిన స్పెషల్ రియాక్షన్ ఫోర్స్ బలగాలు ఆదివారం అతడిని చుట్టుముట్టాయి. ఆ సమయంలో భీకర ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. మెంచో ఆర్మీ మిలిటరీ హెలికాప్టర్‌పై దాడి చేసిన సమయంలో ఇరు పక్షాల నుంచి భారీగా కాల్పులు చోటు చేసుకున్నాయి. మెంచో గన్‌మెన్‌ల దాడితో హెలికాప్టర్‌ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఎన్‌కౌంటర్‌లో మెంచో, ఆయన భద్రతాసిబ్బందిలో ఇద్దరు తీవ్రంగా గాయపడి సైనికులకు చిక్కారు.
మెక్సికన్ స్పెషల్ ఫోర్సెస్ ఆపరేషన్‌లో గాయపడిన ఒసేగేరాను హెలికాప్టర్‌లో తరలిస్తున్న సమయంలో అతడు, అతడి ఇద్దరు గన్‌మెన్ ప్రాణాలు కోల్పోయారని మెక్సికో రక్షణ శాఖ ప్రకటించింది. ఒసేగేరాకు చెందిన ఒక ప్రియురాలి నుంచి అందిన టిప్ ఆధారంగా తాము తపల్పాలో అతడి స్థావరాన్ని చుట్టుముట్టామని రక్షణ మంత్రి రికార్డో ట్రివిల్లా ప్రకటించారు. ఎల్ మెంచోకు అత్యంత సన్నిహిత గర్ల్‌ఫ్రెండ్స్‌లో ఒకరైన ఆమెను అతడి విశ్వసనీయుడు ఒకరు తల్పాలకు తీసుకువచ్చాడని ట్రివిల్లా తెలిపారు. శనివారం ఆమె ఒసేగేరాను కలుసుకుని, తిరిగి వెళ్లిపోయింది. అప్పుడు ఒసేగేరా, ఆయన భద్రతా సిబ్బంది మాత్రమే ఆ స్థావరంలో మిగిలారని ఆయన పేర్కొన్నారు. ఆదివారం నేషనల్ గార్డ్స్‌కు చెందిన తక్షణ ప్రతిస్పందన బలగాలు.. ఆపరేషన్‌లోకి దిగాయి. ఒకే సమయంలో ఇటు భూతలం నుంచి, అటు గగనతలం నుంచి ముప్పేట దాడి చేశాయి.
రహస్యంగా, ఆశ్చర్యకరంగా దాడి జరిగేలా ప్లాన్ చేసిన భద్రతా బలగాలు.. జెలిస్కోలోకి ఎంటర్ కాలేదు. ఒసేగేరా ఇంకా స్థావరంలోనే ఉన్నాడని ధృవీకరించుకున్నాక.. ఒక్కసారిగా కాల్పులతో విరుచుకుపడ్డాయి. ‘ఇది చాలా భీకరదాడి అనే చెప్పాలి’ అని ట్రివిల్లా ఏఎఫ్‌పీకి చెప్పారు. అతను పట్టుబడిన సమయంలో అతని వద్ద అసాల్ట్ వెపన్లు, రెండు రాకెట్ లాంచర్లు సైతం దొరికాయని తెలిపారు. ఇవే తరహా బజూకాస్‌తో 2015లో ఒసేగేరా గన్‌మెన్ ఒక మిలిటరీ హెలికాప్టర్‌ను కూల్చివేశారు. దాంతో ఆ సమయంలో అతడిని బంధించడం సాధ్యం కాలేదు. కానీ.. ఆదివారం నాటి పరిణామాలు ఒసేగేరాకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. మిలిటరీ దాడులతో అంతా పారిపోయి.. దట్టమైన అటవీ ప్రాంతంలో తలదాచుకున్నారు. వాళ్లను వెంటాడిన బలగాలు.. ఒక పొదల మధ్య ఉన్న ఒసేగేరాను పట్టుకున్నారు.
ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఆపరేషన్‌లో మొత్తం 62 మంది చనిపోయారు. వీరిలో నేషనల్ గార్డ్స్ మిలిటరీ పోలీసులు 24 మంది ఉండగా.. అనుమానిత గ్యాంగ్‌స్టర్లు 34 మంది ఉన్నారు. ఈ ఘటన నేపథ్యంలో జెలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అనుయాయులు మెక్సికోలో చెలరేగిపోయారు. పదిపన్నెడు రాష్ట్రాల్లో మొత్తం 85 చోట్ల రోడ్లపై కార్లను దహనం చేశారని రాయిటర్స్ రిపోర్ట్ పేర్కొంటున్నది. సోమవారం నాటికి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని మెక్సికో అధ్యక్షుడు క్లాడియా షీన్‌బామ్ ప్రకటించారు. అయినప్పటికీ మెక్సికో ప్రభుత్వం ఒసేగేరాకు పట్టున్న ప్రాతంగా చెప్పే జెలిస్కోలో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఒసేగేరా, అతడి ఇద్దరి గన్‌మెన్ మృతదేహాలను మెక్సికో సిటీలోని జనరల్ ప్రాసిక్యూటర్ ఆఫీస్‌కు తరలించి.. అక్కడి నుంచి వారి బంధువులకు అప్పగించారు.
