యువతను విస్మరించిన బీఆరెస్‌, బీజేపీలు: సీపీఐ నారాయణ

బీఆరెస్‌, బీజేపీలు తమ పాలనలో మాదిరిగానే మ్యానిఫెస్టోలలో కూడా యువతను విస్మరించాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు

యువతను విస్మరించిన బీఆరెస్‌, బీజేపీలు: సీపీఐ నారాయణ
  • బీజేపీ మ్యానిఫెస్టో నేతీ బీరకాయ నెయ్యి
  • సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజం


విధాత : బీఆరెస్‌, బీజేపీలు తమ పాలనలో మాదిరిగానే మ్యానిఫెస్టోలలో కూడా యువతను విస్మరించాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ బీఆరెస్‌, బీజేపీ మ్యానిఫెస్టోలు అరచేతిలో వైకుంఠం చూపించేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. యువతను ఆ రెండు పార్టీలు దగా చేస్తున్నాయని, పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం పోటీ పరీక్షలు నిర్వహించలేకపోయిందని విమర్శించారు.


దళితుడ్ని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశాడని, ఇప్పుడు బీసీని సీఎం చేస్తానని బీజేపీ చెబుతుందోన్నారు. బీసీని సీఎం చేస్తానని చెబుతున్న బీజేపీ వారి పార్టీ బీసీ అధ్యక్షుడిని తొలగించిందని చురకలేశారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో బీజేపీ మ్యానిఫెస్టో అలా ఉందని సెటైర్లు వేశారు. ఎప్పటికైనా బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని, తెలంగాణ ప్రజల ఆలోచించాలని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వేసే ఒక ఓటుతో బీఆరెస్‌, బీజేపీ, ఎంఐఎం అనే మూడు పిట్టలు ఖతమవుతాయన్నారు.


ఎప్పుడైతే కవితను లిక్కర్ స్కాం నుండి తప్పించారో అప్పుడే బీజేపీ- బీఆర్ఎస్ ఒక్కటే అని బయటపడిందన్నారు. గోబెల్స్ బతికి ఉంటే కేసీఆర్, మోడీ మాటలు విని చచ్చిపోయే వాడన్నారు. బీజేపీ, బీఆరెస్‌, ఎంఐఎంలు ఒక్కటే కాకపోతే ఎంఐఎం గోషామహల్ లో ఎందుకు పోటీ చేయడం లేదని నారాయణ ప్రశ్నించారు. కొత్తగూడెంలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 10లక్షలకు కొత్తగూడెంలో బీ ఫామ్ అమ్ముకుందని, జలగం వెంగళరావు వారుసుడు వెంకట్రావుకు బీ ఫామ్ కొనుక్కునే దుస్థితి పట్టిందన్నారు.