Mahesh Kumar Goud : బీజేపీ డైరక్షన్ లోనే రాహుల్ గాంధీపై కేటీఆర్ విమర్శలు

కేటీఆర్ విమర్శలు బీజేపీ డైరక్షన్‌లోనే జరుగుతున్నాయని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్(Mahesh Kumar Goud) ఆరోపించారు. రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ దాడిని ఎద్దేవా చేశారు.

విధాత, హైదరాబాద్ : బీజేపీ డైరక్షన్ లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తున్నాడని పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) విమర్శించారు. శనివారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అంశంపై రాహుల్ గాంధీ స్పందించాలంటూ కేటీఆర్ విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాహుల్ గాంధీని(Rahul Gandhi) విమర్శించే ముందు..మీ చెల్లెలు కవిత చేసిన బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఆరోపణల సంగతేమిటని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఇప్పటికే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ మానసికంగా విలీనమైందని….అందుకే మోదీ మెప్పుపొందేందుకు రాహుల్ గాంధీని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారన్నారు.కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మీ కుటుంబాలే ఎందుకు బంగారు మయమయ్యాయో ముందు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారన్నది వాళ్లు స్పీకర్ కు చెప్పుకుంటారని..ఇందులో కేటీఆర్, మహేష్ గౌడ్ ప్రమేయం ఏముంటుందన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు. ఫిరాయింపులును ప్రోత్సహించిన బీఆర్ఎస్(BRS) గత చరిత్ర మరిచిపోవద్దన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండటం ద్వారా మోదీకి, ఎన్డీఏకు బీఆర్ఎస్ మద్దతునిచ్చిందని మహేష్ గౌడ్ ఆరోపించారు. ఓటు చోరీకి పాల్పడి బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చారని రాహుల్ గాంధీ నిరూపించారన్నారు. దానిని జీర్ణించుకోలేని మోదీ దేశంలో కేటీఆర్ లాంటి నాయకులతో రాహుల్ గాంధీని విమర్శించేలా చేస్తున్నారన్నారు. కాళేశ్వరం అక్రమాలపై కేసును సీబీఐకి అప్పగిస్తే 48గంటల్లో నిగ్గు తేలుస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాడని.. మా ప్రభుత్వం సీబీఐకి కేసును అప్పగించి రోజులు గడుస్తున్నా ఇంతవరకు కేసు విచారణకు సీబీఐ ఎందుకు ముందుకు రాలేదో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. ఆ రెండు పార్టీల అనధికార విలీనానికి ఇదొక నిదర్శనమన్నారు. కేసీఆర్ ప్రధాని మోదీకి మోకరిల్లి సీబీఐ విచారణ జరుగకుండా చూస్తున్నారన్నారు. గతంలో కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీకి వెళ్లి నడ్డాను కలిసి మోకరిల్లారని మహేష్ గౌడ్ ఆరోపించారు.