BJP DNAలోనే వివ‌క్ష ఉంది: చీఫ్ విప్ విన‌య్‌భాస్క‌ర్

కోచ్ ఫ్యాక్టరీ పై మాట తప్పిన కేంద్రం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం విధాత, వరంగల్: బీజేపీ డీఎన్ఏలోనే వివక్ష దాగి ఉందని తెలంగాణ విషయంలో ఇదింకా ఎక్కువగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా కాజీపేట చౌరస్తాలో బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో సోమవారం పార్టీ శ్రేణులు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పార్లమెంట్ సాక్షిగా పొందుపరిచిన విభజన హామీలను అపహాస్యం […]

  • Publish Date - December 26, 2022 / 01:26 PM IST
  • కోచ్ ఫ్యాక్టరీ పై మాట తప్పిన కేంద్రం
  • కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

విధాత, వరంగల్: బీజేపీ డీఎన్ఏలోనే వివక్ష దాగి ఉందని తెలంగాణ విషయంలో ఇదింకా ఎక్కువగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా కాజీపేట చౌరస్తాలో బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో సోమవారం పార్టీ శ్రేణులు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

పార్లమెంట్ సాక్షిగా పొందుపరిచిన విభజన హామీలను అపహాస్యం చేస్తూ రాజ్యసభలో కాజిపేటలో రైల్వే కోచ్ పరిశ్రమ ఏర్పాటు చేయమని తెగేసి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని త‌ప్పుప‌ట్టారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో పాల్గొన్నచీఫ్ విప్ దాస్యం మాట్లాడారు.

అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కాజీపేట ప్రజల కలను కలగానే మిగిల్చిందని ఆయన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై మండిపడ్డారు. 1980లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు కాజీపేటకు ఫ్యాక్టరీని మంజూరు చేస్తే అప్పుడు అయోధ్యపురం, మడికొండ పరిసర ప్రాంతాల్లో స్థల సేకరణకు కూడా ప్రతిపాదనలు చేశారన్నారు.

కానీ అప్పుడు పంజాబ్ అల్లర్లను తగ్గించడానికి డొంగోవాలా ఒప్పందం ప్రకారం కాజీపేటకు మంజూరైన ఫ్యాక్టరీని పంజాబ్ కు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తరలించిందని ఆయన అన్నారు. అప్పుడు స్థానికంగా అనేక ఉద్యమాలు జరిగాయి, ఇటీవల కోచ్ ఫ్యాక్టరీ సాధన పోరాట సమితి పేరుతో కూడా దశాబ్ద కాలంగా దశల వారిగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు కోచ్ ఫ్యాక్టరీ రాలేదన్నారు.

కోచ్ ఫ్యాక్టరీని మరిపించడానికి పి ఓ హెచ్ వేగన్ పరిశ్రమ పేర్లతో చిన్న చిన్న పరిశ్రమలు మంజూరు చేశారు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తేనే షెడ్లను ఏర్పాటు చేస్తామని నిబంధన పెట్టారు. 160 ఎకరాల భూమి స్థలం సేకరించి ఇచ్చినా కూడా రైల్వే శాఖ సాకులు చెబుతూ వాయిదా వేస్తూ వస్తుందని చీఫ్ విప్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం మా తెలంగాణకు ప్రయోజనం చేకూర్చే ఒక్కటంటే ఒక్క విభజన హామీని కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోగా రాష్ట్ర బీజేపీ నాయకత్వం అవగాహన రాహిత్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేయడం వారి దిగజారుడు తనానికి అద్దం పడుతోందని ఆయన అన్నారు.

తెలంగాణ బీజేపీ నాయకత్వానికి విభజన హామీలపై ఎంతమాత్రం అవగాహన ఉన్నా ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు పరిశ్రమలను, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదో సమాధానం చెప్పాలని ఆయన ప్ర‌శ్నించారు.

రాజ్యసభలో వారి కేంద్ర మంత్రి తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తే. స్థానిక బీజేపీ నాయకులేమో రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించడం లేదని ప్రచారం చేయడం బీజేపీ ద్వంద దొంగ వైఖరిని బహిర్గతం చేస్తుందని తెలంగాణ ప్రజలకు తెలుస‌ని అన్నారు.

అభివృద్ధి, సంక్షేమం అని మేమంటుంటే బీజేపీ పార్టీయేమో అల్లర్లు, గొడవలు, చిచ్చులను సృష్టించాలని చూడడం అత్యంత దౌర్భాగ్యమైన చర్యని ఆయన అన్నారు. నై తెలంగాణ, నో తెలంగాణ అన్నోళ్లతోనే జై తెలంగాణ అనిపించిన తెలంగాణ ప్రజలు విభజన హక్కులను పొందేందుకు మా ప్రాంతానికి లబ్ధిని చేకూర్చే కోచ్ పరిశ్రమ విషయంలో కేంద్రంపై దశల వారీగా పోరాటం ఉధృతం చేస్తామని చీఫ్ విప్ హెచ్చరించారు. అనంత‌రం కేంద్ర ప్ర‌భుత్వ దిష్టిబొమ్మను ద‌హ‌నం చేశారు.

కార్యక్రమంలో కూడా చైర్మన్ సుందర్రాజు యాదవ్, కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, బీఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు నార్లగిరి రమేష్, కాజిపేట రైల్వే కోచ్ సాధన సమితి సభ్యులు, పలువురు కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.