Site icon vidhaatha

Eetala Rajender । కేసీఆర్‌కు ఆరేళ్లు పడితే… రేవంత్‌కు మూడు నెలల్లోనే అధికారం నెత్తికెక్కింది : ఈటల సంచలన వ్యాఖ్యలు

Eetala Rajender । రేవంత్ రెడ్డి అధికారం నెత్తికి ఎక్కి ఎవరినీ లెక్కజేయని స్థాయికి ఎదిగిండని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. అధికారం తలకెక్కడానికి కేసీఆర్‌కు ఆరేళ్లు పడితే.. రేవంత్ రెడ్డికి  మూడు నెలలే పట్టిందన్నారు. సోమవారం ఇందిరాపార్క్ వద్ద బీజేపీ రైతు హామీల సాధన దీక్ష నిర్వహించింది.  ఈ దీక్షలో బీజేపీ ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ధర్మపురి అరవింద్, బీజే ఎల్ పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తదితర నేతల హాజరైన ఈ దీక్షలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ మోసానికి దగాకు మారుపేరు రేవంత్ అని వ్యాఖ్యానించారు.

డబ్బుల కోసమే…

రేవంత్ రెడ్డి రెండింటి కోసమే ఇదంతా చేస్తున్నాడని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఒకటి  హైడ్రా బూచి చూపు బిల్డర్ల దగ్గర డబ్బులు వసూలు చేసి హైకమాండ్‌కు డబ్బులు పంపడానికి, రెండవది మూసీ ప్రక్షాళన పేరుతో లక్షన్నర కోట్లలో వచ్చే కమీషన్ కోసం అని ఆరోపించారు. హైకోర్టు హైడ్రాపై స్పందించడం శుభదినమని ఈటల అన్నారు. హైకోర్టు తప్పు పట్టింది అధికారులను కాదని, రేవంత్‌రెడ్డినే తప్పుపట్టిందని వ్యాఖ్యానించారు. రేషం ఉంటే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై రోడ్ మ్యాప్ ప్రకటించాలని  ఈటల  రాజేందర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.. ఇప్పటివరకు ఎంత రుణమాఫీ అయ్యిందో పబ్లిక్ పోర్టల్‌లో పెట్టాలన్నారు. రుణమాఫీ చేయకుంటే నీ భరతం పట్టుడు ఖాయమని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. పేదల కన్నీళ్ళలో కాంగ్రెస్ కొట్టుకుపోతుంది బీ కేర్ ఫుల్  అని అన్నారు. రేవంత్ రెడ్డి అబద్ధాల హామీలు ఇస్తే నమ్మి ప్రజలు ఓట్లు వేశారని ఈటల తెలిపారు. మోసానికి, దగాకు మారుపేరు రేవంత్ అని అన్నారు. రాహుల్ గాంధీని కూడా బోల్తా కొట్టించాడని ఆరోపించారు. 2018లో కూడా కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ చేస్తా అంటే.. ఆనాడే సాధ్యం కాదని, మోసపు మాటలు అని చెప్పానన్నారు. కేసీఆర్ కూడా అలవికాని హామీ ఇచ్చి, అడ్రస్ లేకుండా పోయారని ఈటల అన్నారు. కేసీఆర్ ను ఓడించాలని ప్రజలు, విద్యార్థులు, ప్రజాస్వామిక వాదులు కాంగ్రెస్ కు ఓటు వేశారన్నారు. ఆరు గ్యారంటీలలో ఒక్క ఉచిత బస్సు తప్ప ఏమీ అమలు కాలేదన్నారు. రూ.17,900 కోట్లు రుణమాఫీ చేశామని సిఎం కార్యాలయం ప్రకటించింది తప్ప ఎక్కడా లెక్కలు చెప్పలేదన్నారు. దమ్ముంటే ఎంత రుణమాఫీ అయ్యిందో లెక్కలతో సహా ప్రజా పోర్టల్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు అండగా ఉండేందుకే ఈ రోజు దీక్ష చేస్తున్నామన్నారు.

ఎవరితోనైనా చర్చించావా రేవంత్..?

మిస్టర్ రేవంత్ రెడ్డి.. ఇంత పెద్ద నిర్ణయం తీసుకొనే ముందు ప్రజాప్రతినిధులను సంప్రదించావా ?,  క్యాబినెట్ లో చర్చించావా ?, MLA లకు చెప్పావా ?  అని ఈటల అడిగారు.  రేవంత్ ను చూస్తే ఇళ్లను కూల్చి పేదల ఉసురు పోసుకున్న సంజయ్ గాంధీ గుర్తుకు వచ్చాడని, ఆయన వారసుడు ఈయన అని వ్యాఖ్యానించారు. మేధావుల్లారా హైదరాబాద్ లో చెరువులు ఉపయోగపడడం లేదు.. ఆ మురికి నీళ్లు తీసి మంచి నీటితో నింపేందుకు పోరాడాలని ఈటల కోరారు. సూరారం చెరువు కింద ఎప్పుడో   పట్టాలు ఇస్తే  600 మంది ఇల్లు కట్టుకుంటే… వాటిని కూలుస్తానని అంటున్నారన్నారని విమర్శించారు.  రేవంత్ రెడ్డి …దమ్ముంటే రుణమాఫీ చెయ్యి, రైతుబందు ఇవ్వు.దమ్ముంటే ఆరు గ్యారంటీలు అమలు చేయి..కానీ ఇలా పేదల ఉసురు పోసుకోవద్దు అని ఈటల రాజేందర్ హితవు పలికారు.

Exit mobile version