విరుగుడు లేని విషం తాగిన వ్యక్తికి ఊపిరితిత్తుల మార్పిడి

  • Publish Date - October 14, 2023 / 04:57 AM IST

  • యశోద హాస్పిటల్ లో విజయవంతమైన దేశంలోనే మొదటి కేసు


విషం తాగిన వాళ్ళు చాలా సందర్భాలలో బతకడమే కష్టం. అలాంటిది.. విరుగుడు లేని విషాన్ని తాగిన వ్యక్తి.. ఇప్పుడు కొత్త ఊపిరి పోసుకున్నాడు. విషం తో దెబ్బతిన్న ఊపిరితిత్తుల స్థానం లో కొత్త వాటిని అమర్చుకుని మరణాన్ని జయించాడు. ఇందుకు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ వేదిక అయింది. అవయవ మార్పిడి మనకు కొత్తేమీ కాదు. ఊపిరితిత్తుల మార్పిడి కూడా కొత్త విషయం కాదు. కానీ పారా క్విట్ అనే అత్యంత ప్రమాదకరమైన పురుగుల మందు తాగడం వల్ల చెడిపోయిన రెండు శ్వాస కోశాలనూ ఒకేసారి ట్రాన్స్ ప్లాంట్ చేసి అరుదైన చికిత్సకు తెర లేపారు యశోద హాస్పిటల్ డాక్టర్ లు.


మహబూబాబాద్ జిల్లా, ముర్రాయిగూడెంకు చెందిన 23 ఏళ్ల రోహిత్ తాను రష్యా వెళ్ళడానికి తల్లిదండ్రులు అంగీకరించలేదని క్షణికావేశంలో పురుగుల మందు పారా క్విట్ ను తాగేసి కింద పడిపోయాడు. హన్మకొండకు తీసుకెళ్ళి అవసరమైన వైద్యం చేయించారు. కిడ్నీ లు పాడైపోతే డయాలిసిస్ చేయించారు. చివరికి ఊపిరితిత్తులు కూడా దెబ్బ తినడంతో హుటాహుటిన హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇక్కడ జీవనదాన్ సాయంతో కెడావర్ డోనార్ నుంచి తీసుకున్న రెండు లంగ్స్ ని ట్రాన్స్ ప్లాంట్ చేశారు. ఈ చికిత్స కోసం పలు రకాల ఫౌండేషన్స్ ఆర్థిక సహాయం అందించాయి. గత నెల రోజులపైగా ప్రాణాలతో పోరాడుతున్న రోహిత్ ఇప్పుడు కొత్త ఊపిరి తీసుకుంటున్నాడు.

కలుపు, గడ్డి నియంత్రణకు ఉపయోగించే “పారాక్వాట్” అనే విష రసాయనం సేవించడం వల్ల రోహిత్ ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయనికి భారీ నష్టం జరిగింది. పారా క్విట్ విషకణాలు ఊపిరితిత్తులను చేరడం ద్వారా అవి ఫైబ్రోసిస్ కి గురయ్యాయి. ఈ విషానికి పూర్తి విరుగుడు కూడా లేకపోవడంతో చాలామంది హాస్పిటల్ లో చేర్చుకోడానికి కూడా వెనుకాడుతారు. అందుకే ఈ తరహా కేసు మన దేశంలోనే మొదటిది. ఇలాంటి సందర్భంలో ఊపిరితిత్తుల మార్పిడి జరిగిన కేసులు ప్రపంచవ్యాప్తంగా 4 మాత్రమే ఉన్నాయి.


పవన్ గోరుకంటి,

డైరెక్టర్,

యశోద హాస్పిటల్స్



సాధారణంగా ఈ విషం ముందు కిడ్నీ, లివర్ లపై వెంటనే ప్రభావం చూపుతుంది. ఆ తర్వాత రక్తం ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది. చివరి దశలో మరణానికి దారితీస్తుంది. ప్రాణాపాయస్థితిలో మా దగ్గరకు వచ్చిన రోహిత్ ను మెకానికల్ వెంటిలేటర్‌పై వైద్యం అందించి, ఆ తర్వాత ఎక్మో పెట్టాం. అతను 15 రోజులకు పైగా ఎక్మో పైన ఉన్నప్పటికీ పరిస్థితిలో ఎటువంటి మార్పూ రాలేదు. దాంతో ఊపిరితిత్తుల మార్పిడి చేయాలనుకున్నాం. మన దేశంలో ఈ పరిస్థితి నుండి ఇంతవరకు ఎవరు బయటపడలేదు. కాబట్టి నిర్దుష్ట పరీక్ష ద్వారా అతని శరీరంలో ఎటువంటి విషం మిగిలి లేదని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఊపిరితిత్తుల మార్పిడికి ప్లాన్ చేశాం. రోహిత్ చాలా తొందరగా రికవరీ అయ్యాడు.


డాక్టర్ హరికిషన్ గోనుగుంట్ల,

సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్,

యశోద హాస్పిటల్స్- సికింద్రాబాద్

Latest News