విధాత, హైదరాబాద్ : ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రోటోకాల్ కు విరుద్దంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రసంగం లేకుంగానే వేడుకలను ముగించిన సిరిసిల్ల కలెక్టర్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిబంధనలు పాటించకుండా వ్యవహరించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ వివాదంపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల్లోపు తన సంజాయిషీ ఇవ్వాలని అదేశించారు. కలెక్టర్ ఇచ్చే వివరణను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగానే కాకుండా..అంతకుముందు పంద్రాగస్టు రోజు కూడా జెండా ఆవిష్కరణకు అతిథిగా వెళ్లిన ఆది శ్రీనివాస్ కు కలెక్టర్, ఎస్పీలు స్వాగతం పలకకపోవడం కూడా వివాదస్పదమైంది. దీంతో వరుస ఘటనలతో ఆగ్రహించిన ఆది శ్రీనివాస్ కలెక్టర్ తీరుపై తాజాగా సీఎస్, సీఎంఓ కు ఫిర్యాదు చేశారు.