Telangana IAS |
పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఓ ఐఏఎస్ ఆఫీసర్.. తన భార్యను వరకట్నం కోసం వేధింపులకు గురి చేశారు. అంతేకాదు తనతో అసహజ శృంగారం చేయాలని బలవంతం చేస్తున్నారు భార్యను. ఆ ఐఏఎస్ అధికారి వేధింపులు, ఆగడాలు భరించలేని భార్య.. కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన కోర్టు.. ఐఏఎస్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝా స్వస్థలం బీహార్‌లోని దర్భంగా జిల్లా. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా ప్రాంతానికి చెందిన యువతిని సందీప్ కుమార్ 2021లో వివాహం చేసుకున్నారు. కట్నం కింద రూ. కోటికి పైగానే ఇచ్చారు.
అయినప్పటికీ ఆ కట్నం సరి పోలేదని, మరింత బంగారం, ఆభరణాలు తీసుకురావాలని ఐఏఎస్ ఆఫీసర్ తనను డిమాండ్ చేశారని భార్య ఆరోపించింది. గృహ హింసతో పాటు అసహజ శృంగారానికి బలవంతం చేస్తున్నాడని తెలిపింది. తన భర్త చర్యలపై కోర్బా ఎస్‌పీ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు వాపోయింది.
దీంతో ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపింది. ఆమె ఫిర్యాదుపై విచారణ జరిపిన కోర్టు.. ఐఏఎస్ ఆఫీసర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. సందీప్ కుమార్ ఝా ప్రస్తుతం తెలంగాణ ఐటీ శాఖలో జాయింట్ సెక్రటరీగా సేవలందిస్తున్నారు.