AP News | భర్త వేధింపులు.. ఐఏఎస్ ఆఫీసర్ కూతురు ఆత్మహత్య

ప్రేమించి పెళ్లి చేసుకున్న కొద్ది నెలలకే ఓ ఐఏఎస్ ఆఫీసర్ కుమార్తే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. బుగ్గనరపల్లి తండాకు చెందిన ఓ వ్యక్తిని సీనియర్ ఐఏఎస్ చిన్నరాముడు కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకుంది.

AP News | భర్త వేధింపులు.. ఐఏఎస్ ఆఫీసర్ కూతురు ఆత్మహత్య

విధాత, హైదరాబాద్ :

ప్రేమించి పెళ్లి చేసుకున్న కొద్ది నెలలకే ఓ ఐఏఎస్ ఆఫీసర్ కుమార్తే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. బుగ్గనరపల్లి తండాకు చెందిన ఓ వ్యక్తిని సీనియర్ ఐఏఎస్ చిన్నరాముడు కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకుంది. భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె ఇంటివద్దనే ఉంటోంది. ఈ క్రమంలో మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉంటున్న ఐఏఎస్‌ చిన్నరాముడు కుమార్తె మాధురి సాహితీబాయి(27) నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం బుగ్గనపల్లి తండాకు చెందిన రాజేష్‌నాయుడిని ప్రేమించింది. తరువాత గత మార్చిలో ఆమె కులాంతర వివాహం చేసుకుంది.

అయితే, పెళ్లైన మూడో నెల నుంచి భర్త తనను వేధిస్తున్నాడంటూ తల్లిదండ్రులకు మాధురి చెప్పింది. దీంతో ఆమెను వారు తమ ఇంటికి తీసుకురావడంతో అప్పటి నుంచి గుంటూరులోని పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో మనస్థాపానికి గురైన మాధురి ఆదివారం రాత్రి తన గదిలోని బాత్ రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించారు. తల్లి లక్ష్మీబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చిన్న రాముడు మీడియాతో మాట్లాడుతూ.. తమ కుమార్తెను రాజేష్‌నాయుడు ఉద్యోగం ఉందని మోసం చేసి మహానందిలో రిజిస్టర్‌ మ్యారేజీ చేసుకున్నాడని చెప్పారు. పెద్దల సమక్షంలో మళ్లీ పెళ్లి చేస్తామని చెప్పి అతడితో కుమార్తెను పంపించామన్నారు. అయితే, కొద్ది రోజులకే అదనపు కట్నం తెమ్మంటూ రాజేష్‌ వేధింపులకు గురి చేసేవాడన్నారు. ‘నీకు తానే దిక్కు, చంపేస్తానని రాజేశ్ నాయుడు బెదిరించేవాడు. కనీసం మాకు ఫోన్‌ చేయాలన్నా భర్త అనుమతి తీసుకోవాల్సి వస్తోందని, ఇక్కడ ఉండలేనని కుమార్తె చెప్పడంతో రెండు నెలల కిందట ఇంటికి తీసుకొచ్చాం. వచ్చిన నాటి నుంచి తన భర్తది నిజమైన ప్రేమ కాదని, అందుకే తీసుకెళ్లేందుకు రావడం లేదని మా కూతురు బాధపడుతూ ఉండేది. మాకు ఇలా దూరమవుతుందని అనుకోలేదు’ అని చిన్నరాముడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.