నిజామాబాద్ అండర్ బ్రిడ్జి కింద వరదలో చిక్కిన ఆర్టీసీ బస్సు
విధాత, హైదరాబాద్ : తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉన్న ఆవర్తనం రాయలసీమ, పరిసర ప్రాంతాల మీదుగా సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని చెప్పింది. ద్రోణి సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు రాయలసీమ, పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం తమిళనాడు నుంచి కొమొరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉందని చెప్పింది. మంగళవారం వరకు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వస్తాయని పేర్కొంది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరిలో వానలు పడే సూచనలున్నాయని చెప్పింది. అలాగే, బుధ, గురువారాల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వానలు పడే సూచనలున్నాయని తెలిపింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో కొత్తగూడెం, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, జనగాం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా జనగామలో 9 సెంటీమీటర్ల వర్షాపాతం రికార్డయ్యింది
రైల్వే అండర్ బ్రిడ్జి కింద వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
నిజమాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం గంటన్నర సేపు కుండపోత వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వానకు పలు ప్రాంతాలు జలమయం కాగా రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయింది. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద నీటిని అంచనా వేయలేక ఆర్టీసీ డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడంతో బస్సు వరద నీటిలో చిక్కుకుంది. అందులోని కొంతమంది ప్రయాణికులు ఈత కొట్టుకుంటూ బయటకు రాగా మరి కొంతమందిని స్థానికుల సహకారంతో క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చారు. కుండపోతగా కురిసిన వర్షానికి పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. వర్షం రోడ్లపై నిలవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, గాజులరామారం, జగద్గిరిగుట్ట, బహదూర్పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల, బోయినపల్లి, ప్రగతినగర్, బేగంపేట, తిరుమలగిరి, అల్వాల్, మారేడుపల్లి, కూకట్‌పల్లి, హైదర్ నగర్, బాచుపల్లి, మూసాపేట్, కోఠి, మలక్పేట్, గచ్చిబౌలి, టోలిచౌకీ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షేక్ పేటఫ్లైఓవర్‌పై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. షేక్ పేట- ఫిలింనగర్- గచ్చిబౌలి మార్గంలో, మెహదీపట్నం- టోలిచౌకి మార్గంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. షేక్ పేట సెంట్రల్ మీడియాన్ వద్ధ రోడ్లు జలమయమై వాహనాలు నీటిలో కొట్టుకపోగా, ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సహాయంతో వాటిని పక్కకు తప్పించారు.