Site icon vidhaatha

Madhavi Latha | గోషామ‌హ‌ల్‌లో అత్య‌ధికంగా పోలింగ్.. ఆ ఓట్ల‌న్ని మాధ‌వీల‌త‌కేనా..?

హైద‌రాబాద్ : ఈ లోక్‌స‌భ‌ ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం హాట్ టాపిక్‌గా మారింది. దేశ ప్ర‌జ‌లంద‌రూ ఈ నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి సారించారు. ఎందుకంటే ఎంఐఎం అధినేత‌, సిట్టింగ్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీని ఢీకొట్టేందుకు బీజేపీ మాధ‌వీల‌త‌ను రంగంలోకి దింపింది. మొద‌ట్నుంచి ఆమె హిందూత్వ ఎజెండాతో త‌న ప్ర‌చారాన్ని కొన‌సాగించారు. అంతేకాదు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో కూడా నిలిచారామె. పోలింగ్ రోజున కూడా మ‌ల‌క్‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో ముస్లిం మ‌హిళా ఓట‌ర్ల ప‌ట్ల వింత‌గా ప్ర‌వ‌ర్తించారు. వారు ధ‌రించిన బుర్ఖాను తొల‌గించి, గుర్తింపు కార్డుల ఆధారంగా వారి ముఖాల‌ను ప‌రిశీలించి కేసుల పాల‌య్యారు మాధ‌వీల‌త‌.

అయితే హైద‌రాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలో 48.48 శాతం పోలింగ్ న‌మోదైంది. ఈ పార్ల‌మెంట్ ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో అత్య‌ధికంగా గోషామహ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో పోలింగ్ న‌మోదైంది. 54.72 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు వెల్ల‌డించారు. 2019 ఎన్నిక‌ల‌తో పోల్చితే ఇది ఎక్కువ అని పేర్కొన్నారు.

ఇక గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ నాయ‌కుడు రాజాసింగ్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. హైద‌రాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలోని గోషామ‌హ‌ల్‌లో అత్య‌ధికంగా పోలింగ్ న‌మోదు కావ‌డంతో.. రాజాసింగ్ త‌న మార్క్‌ను చూపించుకున్న‌ట్లు తెలుస్తోంది. పోలైన ఓట్ల‌లో అధికంగా బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి మాధ‌వీల‌త‌కు ప‌డి ఉండొచ్చ‌ని ప‌లువురు విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఒక వేళ విశ్లేష‌కులు ఊహించిన‌ట్టే జ‌రిగితే.. అస‌దుద్దీన్ ఒవైసీకి మాధ‌వీల‌త గ‌ట్టి పోటీని ఇచ్చిన‌ట్టే. ఈ ఫలితం తేలాలంటే జూన్ 4వ తేదీ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

హైద‌రాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలో పోలింగ్ శాతం

1. బ‌హ‌దూర్‌పురా – 50.70
2. చాంద్రాయ‌ణ‌గుట్ట – 49.15
3. చార్మినార్ – 48.53
4. గోషామ‌హ‌ల్ – 54.72
5. కార్వాన్ – 51.23
6. మ‌ల‌క్‌పేట్ – 42.76
7. యాకుత్‌పురా – 43.34

Exit mobile version