AIMIM-AIUDF Alliance | అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో AIMIM-AIUDF పొత్తు? ఒవైసీ–అజ్మల్‌ సంచలన ప్లాన్‌?

అస్సాం అసెంబ్లీకి 2026లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నది. చీఫ్‌ బద్రూద్దీన్‌ అజ్మల్‌.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీతో ఈ మేరకు చర్చలు జరిపినట్టు ప్రకటించారు. కాంగ్రెస్‌తో సంబంధం లేకుండానే తాము మూడో ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తామని అజ్మల్‌ తెలిపారు. తమ మూడో కూటమి 35 సీట్లు గెలుచుకుటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 2 తర్వాత ఢిల్లీలో ఒవైసీని కలిసి సంయుక్త కార్యాచరణను రూపొందించుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ పరిణామం అస్సాంలో కాంగ్రెస్‌ కూటమిని దెబ్బతీసే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

AIUDF AIMIM alliance assam elections

హైదరాబాద్, విధాత ప్రతినిధి:

AIMIM-AIUDF Alliance | దేశంలోని పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని ఓడించడంలో కీలక పాత్ర పోషిస్తున్నదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ కు చెందిన ఎంఐఎం (AIMIM ) పార్టీ.. రానున్న అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సన్నద్ధమవుతోంది. ఈ విషయంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో చర్చించినట్లు అస్సాం రాష్ట్రానికి చెందిన ఆల్ ఇండియా యునైటెడ్ డెమెక్రాటిక్ ఫ్రంట్ (AIUDF ) చీఫ్ బద్రూద్దీన్ అజ్మల్ మీడియాకు తెలిపారు. డిసెంబర్ 2వ తేదీ తరువాత ఢిల్లీలో ఆయనను కలిసి సంయుక్త కార్యాచరణ రూపొందిస్తామని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ తో సంబంధం లేకుండా మూడో ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

2026 ఏప్రిల్‌లో అస్సాం అసెంబ్లీ ఎన్నికలు

అస్సాం రాష్ట్రంలో వచ్చే ఏడాది (2026) ఏప్రిల్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 126 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్డీఏ సభ్యులు 87 మంది ఉండగా, ప్రతిపక్ష బలం 39గా ఉంది. 2021 ఏప్రిల్ నిర్వహించిన ఎన్నికల ప్రకారం ఎన్డీఏలో బీజేపీ కి 64, ఏజీపీ 8, యూపీపీఎల్ 7, బీపీఎఫ్ 3, ఐఎన్డీ కి 5 గురు చొప్పున సభ్యులు ఉండగా ప్రతిపక్షంలో కాంగ్రెస్ 22, ఏఐయూడీఎప్ 15, సీపీఐ ఎం, ఆర్డీ పార్టీలకు ఒక్కరు చొప్పున ఉన్నారు. ఎన్డీఏ నుంచి హిమంత బిశ్వ శర్మ (బీజేపీ) ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ తరుణ్‌ గొగోయ్ 2016 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలు కావడంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2016 నుంచి 2021 వరకు శర్బానంద సోనోవాల్ ముఖ్యమంత్రిగా ఉండగా, 2021 నుంచి హిమంత బిశ్వ శర్మ సీఎం గా పనిచేస్తున్నారు. గత పదేళ్ల నుంచి బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది.

గౌహతిలో బద్రుద్దీన్‌ చర్చలు

వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇవాళ గౌహతిలో ఏఐయూడీఎఫ్ అధినేత బద్రూద్ధీన్ అజ్మల్ జిల్లా, బ్లాక్ స్థాయి నేతలతో సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేసేలా ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో మూడో ఫ్రంట్ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో 35 సీట్లలో తమ పార్టీ పోటీ చేస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కన్నా మెరుగైన సీట్లు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో పొత్తుల విషయమై చర్చించానని, డిసెంబర్ 1వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నందున 2వ తేదీ తరువాత భేటీ అవుదామని చెప్పారన్నారు. ఎంఐఎం పొత్తుతో ఎక్కువ సీట్లలో పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి కాంగ్రెస్ పార్టీ గుణపాఠం నేర్చుకోవాలని హితవు పలికారు. ఎంఐఎం పార్టీ 5 సీట్లను ఎంఐఎం కైవసం చేసుకుందంటూ.. విజయంలో కీలక పాత్ర పోషించిన అసదుద్దీన్‌ను అభినందించారు. అస్సాంలో ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసి వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడుతున్నాయని బద్రూద్ధీన్ గుర్తు చేశారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్ కు చెందిన రాష్ట్రీయ ఉలేమా కౌన్సిల్ అస్సాం ముస్లిం పార్టీ నేతలతో సమావేశమైంది. ముస్లిం పార్టీలతో మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాలని అస్సాం నాయకులను కోరింది. రాష్ట్రంలో ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ పెద్దగా చేసింది ఏమీ లేదని పేర్కొంది. తమ ఓటు బ్యాంకును ఉపయోగించుకోవడం తప్ప మరోటి కాదని నిర్థారణకు వచ్చారు. ఇటీవల గౌహతిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రతిపక్ష పార్టీ నాయకుల సమావేశానికి 25 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యేలను ఆహ్వానించలేదని గుర్తు చేశారు. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లింల విషయం లో ముఖ్యమంత్రి హిమంత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నదని చర్చించారు. 1985 లో యునైటెడ్ ముస్లిం ఫ్రంట్ ఏర్పాటు చేసి 17 సీట్లు సాధించారన్నారు.

బీజేపీకి బీ టీమ్‌ అంటూ ఆరోపణలు

అయితే రాష్ట్రంలో ఏఐయూడీఎప్ బీజేపీకి బీ టీమ్ గా పనిచేస్తున్నదని రాయిజోర్ దళ్ నేత, ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్ ఈ ఏడాది ఏప్రిల్ లో ఆరోపణలు గుప్పించారు. అస్సాంలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడంలో బీజేపీ, ఏఐయూడీఎఫ్ పరస్పరం సహకరించుకుంటున్నాయన్నారు. రెండు పార్టీల ఆటలు వచ్చే ఎన్నికల్లో కొనసాగకుండా అడ్డుకుంటామన్నారు. గత లోకసభ ఎన్నికల్లో ఏఐయూడీఎఫ్ అభ్యర్థులు గెలవకుండా నిరోధించడంలో విజయవంతమయ్యామని, మున్ముందు కూడా ఇదేతీరున పోరాడుతామని అఖిల్ గగోయ్ తెలిపారు. గతేడాది ప్రారంభంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్సాంలో పర్యటించిన సందర్భంగా మాట్లాడుతూ, నాణెంలో ఒకవైపు బీజేపీ, రెండో వైపు ఏఐయూడీఎఫ్ ఉన్నాయని అన్నారు. బీజేపీ కీ బీ టీమ్ గా ఆ పార్టీ వ్యవహరిస్తున్నదని ఆయన ఆరోపించారు. అస్సాం కు చెందిన జమాయిత్ ఉలేమా ఈ హింద్ పై కూడా రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి..
SC Classification | జస్టిస్‌ గవాయ్‌ ప్రసంగంతో మళ్లీ చర్చనీయాంశంగా ఎస్సీ క్రీమీలేయర్‌!
Maoist Chief | మావోయిస్టు చీఫ్ దేవ్ జీ ఎక్కడ?
Hidma Encounter | ఎన్‌కౌంటరేనా?.. హిడ్మా మరణంపై పలు అనుమానాలు!
ED Enters iBomma Piracy Case : ఐబొమ్మ కేసు.. రంగంలోకి ఈడీ

Latest News