Site icon vidhaatha

Asaduddin Owaisi | వచ్చే ఎన్నికల్లో.. మా బ్యాటింగ్ మేమే చేస్తాం.. ఎవరిని గెలిపించాలో నిర్ణయిస్తాం! మేమే కింగ్ మేకర్: అసదుద్దీన్ ఓవైసీ

Asaduddin Owaisi |

విధాత: దళిత బంధు తరహాలో సీఎం కేసీఆర్ ముస్లిం బంధు పథకం తేవాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముస్లిం బంధు అమలు చేయాలని కేసిఆర్ ను ఇప్పటికే తాము పలుమార్లు కోరినా పట్టించుకోవడం లేదన్నారు.

బోధన్‌లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఆగడాలు పెరిగి పోయాయని, తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారన్నారు. ఈ పరిణామాలు చూస్తే బిఆర్ఎస్‌తో ఎంఐఎంకు మంచి సంబంధాలు ఉన్నాయని ఎలా భావిస్తారన్నారు.

వచ్చే ఎన్నికల్లో షకీల్ పై ఎంఐఎం పోటీ చేసి ఓడిస్తుందన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తుందన్నారు. ఎక్కడెక్కడ పోటీ చేస్తామో ఎన్నికల ముందు తమ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామన్నారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటులో ఎంఐఎం కింగ్ మేకర్‌గా అవతరిస్తుందని అన్నారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో భవిష్యత్తులో ఆలోచిస్తామన్నారు. తెలంగాణలో మా బ్యాటింగ్ మేమే చేస్తామని.. మా స్కోర్ మేమే చూసుకుంటామని… ఎవరిని ఓడించాలో.. ఎవరిని గెలిపించాలో మేమే నిర్ణయిస్తామన్నారు.

2024 లో మోడీని మూడోసారి ప్రధానమంత్రి కాకుండా సర్వశక్తులు ఉపయోగిస్తామన్నారు. అందుకోసం కలిసి వచ్చే పార్టీలతో స్నేహం చేస్తామన్నారు. అయితే పాట్నా విపక్ష భేటీకి తమకు ఆహ్వానం అందలేదని తెలిపారు.

Exit mobile version