రేవంత్ సవాల్‌కు సిద్ధం: హరీశ్‌రావు

బీఆరెస్ మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ చేసినట్లుగా ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేస్తానని..ఆయన రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు గురువారం హరీశ్‌రావు ఘాటుగా ప్రతిస్పందించారు

  • Publish Date - April 25, 2024 / 02:20 PM IST

రాజీనామా లేఖతో వస్తా.. నీవు రా
మాజీ మంత్రి టి.హరీశ్‌రావు

విధాత: బీఆరెస్ మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ చేసినట్లుగా ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేస్తానని..ఆయన రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు గురువారం హరీశ్‌రావు ఘాటుగా ప్రతిస్పందించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్థూపం దగ్గరకి నా రాజీనామా లేఖతో వస్తానని..నువ్వు వస్తావా? అక్కడే తేల్చుకుందామని హరీశ్‌రావు సవాల్ విసిరారు.

మన ఇద్దరి రాజీనామా లేఖలను మేధావులకు ఇద్దామని.. ఆగస్టు 15 లోగా మీరు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసి, రుణమాఫీ చేస్తే.. వారు నా రాజీనామా లేఖను స్పీకర్‌కు ఇస్తారని, చేయలేకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇస్తారని హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ నామినేషన్‌ కార్యక్రమం, ఖమ్మంలో నిర్వహించిన పార్లమెంట్‌ నియోజకవర్గ విస్తృతస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో హారీశ్‌రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 15లోగా హామీలను అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఐదేండ్లు ఎమ్మెల్యేగా ఉన్నదానికంటే కోట్ల మంది తెలంగాణ ప్రజలకు రుణమాఫీ, ఆరుగ్యారెంటీలు అందితే అదే తనకు సంతృప్తినిస్తుందన్నారు. తాను ఎప్పుడూ పదవుల కోసం పాకులాడలేదని, పదవుల త్యాగం తనకు కొత్తకాదని, గతంలో మంత్రి, రెండుసార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని చెప్పారు. పదవుల కంటే తెలంగాణ ప్రజల ప్రయోజనమే తనకు ముఖ్యమని స్పష్టంచేశారు.

వంద రోజుల్లోనే కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత

సీఎం రేవంత్‌రెడ్డి వంద రోజుల పాలనలో ఆరు గ్యారంటీలు, హామీలు అమలు చేయలేకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని తెలుసుకుని పార్లమెంటు ఎన్నికల్లో హామీల అమలుపై జనాన్ని నమ్మించేందుకు దేవుండ్లపై ఒట్లు పెడుతున్నాడని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. హామీలు అమలు చెయ్యిమంటే బీఆరెస్‌ను రద్దు చేస్తరా అని రేవంత్‌ సవాల్‌ చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలు బీఆరెస్‌ వెంటే ఉన్నారని, ఎన్నికల్లో బీఆరెస్‌ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

గతంలో అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు, 13 హామీలు అమలు చేస్తం, హామీల అమలు బాధ్యత నాది అని సోనియాగాంధీ స్వయంగా తెలంగాణ ప్రజలకు తన సంతకంతో లేఖ రాశారని గుర్తు చఏవారు. ఆరు గ్యారెంటీలతో పాటు ఏడో గ్యారెంటీగా కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి రోజూ ప్రజలను కలుస్తరని సోనియాగాంధీ చెప్పారని, నాలుగు నెలలు కావస్తున్నా హామీల అమలు కాలేదని, సోనియాగాంధీ రాసిన లేఖకు విలువలేకుండా పోయిందన్నారు. ఆరింటిలో ఐదు గ్యారెంటీలను ఇప్పటికే అమలు చేశామని రేవంత్‌రెడ్డి చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు.

కాంగ్రెస్‌ పాలనలో ఉచిత బస్సు మినహా అంతా తుస్సేనని హరీశ్‌ ఎద్దేవా చేశారు. ఖమ్మంలో ప్రజలు, రైతులు తాగు, సాగునీరు లేక ఇబ్బంది పడుతుంటే.. ఇక్కడి మంత్రులు మాత్రం సమస్యలను గాలికి వదిలి తమ కుటుంబసభ్యులకు టికెట్ల కోసం ఢిల్లీ, బెంగుళూరుకు చక్కర్లు కొట్టారని హరీశ్‌ విమర్శించారు. రాహుల్‌ అదానీని చోర్‌ అంటుంటే రేవంత్‌ అదానీని మంచోడంటున్నడని, రాహుల్‌ను భాయ్‌ అని, మోదీని బడే భాయ్‌ అంటున్నడని, అంటే మళ్లీ మోదీ ప్రధాని కావాలని రేవంత్‌రెడ్డి కోరుతున్నడా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ వేరు, రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ వేరా’ అని హరీశ్‌రావు నిలదీశారు.

గతంలో ఆరెస్‌ఎస్ కార్యకర్తగా రేవంత్‌ చెప్పుకున్నాడని, ఆయన ఎప్పుడైనా బీజేపీలోకి వెళ్లే అవకాశముందన్నారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, బీఆరెస్‌ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, ఖమ్మంలో ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్‌, వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మదన్‌లాల్‌, మెచ్చా నాగేశ్వరరావు, కందాళ ఉపేందర్‌రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Latest News