Rain Alert | హైదరాబాద్ : భాగ్యనగరాన్ని మరోసారి భారీ వర్షం( Heavy Rains ) ముంచెత్తనుందా..? అంటే అవుననే సంకేతమిస్తోంది వాతావరణ శాఖ( Weather Department ). మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు హైదరాబాద్ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షం( Downpour ) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత త్వరగా విధులు ముగించుకుని ఇండ్లకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
ఇక హైదరాబాద్ నగరంలో మంగళవారం మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని తెలిపారు. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మళ్లీ ఆదివారం రాత్రి నాటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆదివారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి నగరం అతలాకుతలమైన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ నగరంతో పాటు సమీప జిల్లాలైన మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ముషీరాబాద్ సర్కిల్‌లోని బౌద్ధ నగర్‌లో 12.4 సెం.మీ., ఎంసీహెచ్ కాలనీలో 11.9, ఉస్మానియా యూనివర్సిటీలో 10.5, కాప్రాలో 10.3, మారేడ్‌పల్లిలో 10.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. షేక్‌పేట, జూబ్లీహిల్స్‌లో 9.9 సెం.మీ., అడిక్‌మెట్‌లో 9.6, అంబేద్కర్ నగర్‌లో 9.5, కుత్బుల్లాపూర్‌లో 9.5, సీతాఫల్‌మండిలో 9.1, హిమాయత్‌నగర్‌లో 9.0, అల్వాల్ కమ్యూనిటీ హాల్ వద్ద 8.8, ఉప్పల్ జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసు వద్ద 8.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది.