Site icon vidhaatha

High Court : సమగ్ర కుల సర్వే లో కంసాలి, వడ్ల, కంచరి, కమ్మరి , శిల్పి లను విశ్వబ్రాహ్మణ కులంగా పరిగణించాలి

అడ్వకేట్ పెందోట శ్రీనివాస్ పిటిషన్ పై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్ట్ ఉత్తర్వులు

High Court : రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల గణన సర్వే లో విశ్వబ్రాహ్మణ కులం కాకుండా వృత్తి పరంగా వేర్వేరు కులాలను చేర్చి సర్వే చేయడంపై రాష్ట్ర హై-కోర్టు స్పష్టత నిచ్చింది. రాష్ట్రంలో బీసీ కులాలను వర్గీకరించిన జీ.ఓ. లో వృత్తులైన కంసాలి, వడ్ల, కంచరి, కమ్మరి , శిల్పి లను విశ్వబ్రాహ్మణ కులంగా పేర్కొంటూ స్పష్టంగా తెలిపింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సమగ్ర కుటుంబ సర్వే లోని ఫారాలలో విశ్వబ్రాహ్మణ కులం కాకుండా వృత్తులను అనుసరించి కంసాలి, వడ్ల, కంచరి, కమ్మరి , శిల్పి లను వేర్వేరు కులాలుగా పేర్కొంది. దీనితో, వేర్వేరు కులాలుగా పేర్కొనడం పట్ల విశ్వ బ్రాహ్మణ సంఖ్య తగ్గి రానున్న కాలంలో ప్రభుత్వ పథకాలలో తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొంటూ, విశ్వ బ్రాహ్మణ సంఘాలు రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్లు, బీసీ కమీషన్ కు, బీసీ సంక్షేమ శాఖ మంత్రికి పలు విజ్ఞాపనలు అందచేశాయి. అయినప్పటికీ, సర్వే ఫారాలలో సరి చేయకుండా కొనసాగించడాన్ని సవాలు చేస్తూ, విశ్వ బ్రాహ్మణ వెల్ఫేర్ అసోషియేషన్ కు చెందిన సీనియర్ అడ్వకేట్ పెందోట శ్రీనివాస్ హై-కోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు. వృత్తి పరంగా కాకుండా కంసాలి, వడ్ల, కంచరి, కమ్మరి , శిల్పి లను ఒకే కులంగా విశ్వ బ్రాహ్మణులుగా ఒకే కోడ్ గా పరిగణించాలని వేసిన పిటీషన్ ను హై-కోర్ట్ ( 11 కోర్టు ) జస్టిస్ సూరేపల్లి నందా పరిగణనలోకి తీసుకొని, కంసాలి, వడ్ల, కంచరి, కమ్మరి , శిల్పి లను వేర్వేరుగా కాకుండా, విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలని ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర హై-కోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వుల పట్ల విశ్వబ్రాహ్మణ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.
Exit mobile version