Site icon vidhaatha

జూనియర్లకు డ్రగ్స్​ అలవాటు చేసిన సీనియర్ మెడికోలు

hyderabad-med-college-students-caught-using-marijuana-8-test-positive

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజ్‌లో నిషేధిత మత్తు పదార్థాల వినియోగం వెలుగులోకి వచ్చింది. కాలేజ్‌లో గత మూడేళ్లనుండి చదువుతున్న సీనియర్‌ విద్యార్థులు స్వయంగా డ్రగ్స్‌ వినియోగించడంతోపాటు తమ జూనియర్లకు కూడా అలవాటు చేసారని పోలీసుల ప్రాథమిక విచారణల్లో తేలింది. మేడ్చల్​ ప్రాంతంలో ఉన్న ఈ ప్రైవేట్ మెడికల్‌ కళాశాలలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB) మరియు EAGLE టీం సంయుక్తంగా దాడులు నిర్వహించగా, మొత్తం 26 మంది విద్యార్థులను టెస్టులు చేశారు. వీరిలో ఎనిమిది మంది, అందులో ఇద్దరు యువతులు కూడా ఉన్నారు, గంజాయి వినియోగించినట్టు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. డ్రగ్స్‌కు బానిసలుగా మారిన ఈ విద్యార్థులందరినీ ప్రస్తుతానికి డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

పోలీసుల ప్రాథమిక నిర్ధారణల ప్రకారం, గత మూడేళ్లుగా కళాశాలలో కొనసాగుతున్న కొందరు సీనియర్‌ మెడికోలు డ్రగ్స్‌ వాడడమే కాకుండా, వాటిని ఇతరులకూ సరఫరా చేసినట్టు ఆధారాలు లభించాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా హైదరాబాద్‌కు చెందిన అర్ఫాత్ అహ్మద్ ఖాన్, కీలక సరఫరాదారుగా పోలీసులు గుర్తించి అరెస్ట్‌ చేశారు. అలాగే, డ్రగ్స్‌ సరఫరాలో ప్రధానంగా ఉన్న బీదర్కు చెందిన జరీనా బానును కూడా అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం డ్రగ్స్‌ సరఫరా వ్యవస్థ మొత్తం ఏ స్థాయిలో ఉంది? మరెంతమంది విద్యార్థులు ఈ విష వలయంలో చిక్కుకున్నారు? అన్న విషయాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశముంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వైద్య విద్యార్ధులే ఇలాంటి మత్తు పదార్థాల వినియోగానికి పాల్పడడం, మరీ ముఖ్యంగా తమ కంటే చిన్న వారిని కూడా ఇందులోకి లాగడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

 

 

 

Exit mobile version