విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూములు, చెరువుల కబ్జాలకు పాల్పడిన అక్రమార్కులపై హైడ్రా కొరడా జుళిపిస్తుంది. శుక్రవారం ఒక్క రోజునే నగరంలో వేర్వేరు చోట్ల ఆక్రమణలను తొలగించడంలో హైడ్రా తన పనితీరుతో దూకుడు ప్రదర్శించింది. బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 10లో రూ.750కోట్ల విలువైన 5ఎకరాల భూమిని ఆక్రమణలు తొలగించి స్వాధీనం చేసుకున్న హైడ్రా ఇదే రోజు పలు ప్రాంతాల్లోనూ ఆక్రమణలను తొలగించి విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడింది. కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం మహాదేవపురం లో పార్కులు, ప్రజావసరాల కు ఉద్దేశించిన స్థలాలు కబ్జాలకు గురి అవుతున్నట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా విచారణ పూర్తి చేసింది. 3.50 ఎకరాల మేర పార్కు స్థలంలో ఆక్రమణలు తొలగించింది.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ విలేజ్ ఏజీ ఆఫీస్ ఉద్యోగులు 2005 లో 13 ఎకరాల మేర లేఔట్ వేయగా అందులో పార్కులు, రహదారులు కలిపి 3 ఎకరాలు కబ్జాకు గురైనట్టు అందిన ఫిర్యాదుపై హైడ్రా రంగంలోకి దిగింది. ఆక్రమణలు తొలగించి 3 ఎకరాల ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కాపాడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తట్టి అన్నారం విలేజ్ శ్రీలక్ష్మి గణపతి కాలనీలో హైడ్రా ఆక్రమణలు తొలగించింది. 680 గజాల పార్కు స్థలంలో 270 గజాలు తన ప్లాట్ అంటూ ఒకరు కబ్జా చేయగా..ఫిర్యాదులను విచారించి మొత్తం 680 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడి స్థానికుల మన్ననలు అందుకుంది.