మెదక్‌ జిల్లా కొల్చారంలో యుద్ధ వాతావరణాన్ని తలపించిన బడిబాట .. మంత్రి, ఎమ్మెల్యే అనుచరుల వాగ్వివాదం

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కోల్చారం మండల కేంద్రంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే సునీతా రెడ్డి పర్యటనలు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి.

  • Publish Date - June 19, 2024 / 08:14 PM IST

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కోల్చారం మండల కేంద్రంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే సునీతా రెడ్డి పర్యటనలు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. బడిబాట కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందన్న వివాదం చినికి చినికి గాలివానగా మారింది. బుధవారం కొల్చారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బడి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంచార్జ్‌ మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యే సునీతా రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజీ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ హాజరయ్యారు. ముందుగా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే సునీతా రెడ్డి ర్యాలీగా వచ్చారు.

 

విద్యార్థులు వారికి ఘన స్వాగతం పలికారు. ఇక్కడి వరకు బాగానే వుంది. బడిబాట వేదిక మీదుకు చేరుకోగానే యుద్ధ వాతావరణం నెలకొంది. విద్యార్థుల బడి బాట కార్యక్రమంలో వేదికపై ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారంటూ బీఆరెస్‌ నేతలు వాగ్వాదానికి దిగడంతో మంత్రి అనుచరులు, ఎమ్మెల్యే అనుచరులు ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకొని తోసుకున్నారు. ఒక దశలో పోలీసులు కూడా అదుపు చేయలేక చేతులు ఎత్తేశారు. బడిబాట కార్యక్రమాన్ని పూర్తి చేయకుండానే మంత్రి కొండా సురేఖ, సునీతా రెడ్డి వెనుదిరిగారు. వెళ్లే క్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులను మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే సునీతా రెడ్డి పలకరించుదాం అని వెళ్లారు.

అక్కడ కూడా మంత్రి, ఎమ్మెల్యే అనుచరుల మధ్య తోపులాట చోటుచేసుకున్నది. అంతరం మండల పరిషత్ నూతన కార్యాలయ భవన ప్రారంభోత్సవంలో ఇది మరికాస్త ముదిరి.. ముష్టియుద్ధాలకు దారి తీసింది. ఓ పక్క కాంగ్రెస్, మరో వైపు బీఅర్ఎస్ నేతల నినాదాల హోరు మధ్యే కార్యాలయ భవనాన్ని కొండ సురేఖ, సునీతారెడ్డి ప్రారంభించారు. కార్యాలయంలోని ఎంపీపీ, జడ్పీటీసీ చాంబర్లు ప్రారంభించే సమయంలో ఎంపీపీని, జడ్పీటీసీని లోనికి అనుమతించపోవడంతో చాంబర్‌ ఎదుట ఎంపీపీ, జడ్పీటీసీ బైఠాయించి ఆందోళన చేశారు. అలాగే కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ వద్ద ఇరు పార్టీల శ్రేణులు నినాదాలు చేసుకుంటూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి పథకంతోపాటు.. తులం బంగారం ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

Latest News