విధాత, హైదరాబాద్: కృష్ణా నది జాలాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం చేసేలా జరిగిన ఒప్పందంపై కేసీఆర్, హరీశ్ రావులు సంతకం చేశారన్నది ముమ్మాటికీ తప్పు అని..దీనిపై చర్చకు సిద్ధమా? లేకపోతే చెప్పు దెబ్బలకు సిద్దమా అఅంటూ కాంగ్రెస్ మంత్రులకు మాజీ మంత్రి జి. జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు. 2013లోనే ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 298.8 టీఎంసీలకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చిందని..కేంద్ర అపెక్స్ కౌన్సిల్ మినిట్స్ లోనే ఉందని గుర్తు చేశారు. ఇంకోసారి రాష్ట్రానికి అన్యాయం చేసేలా కేసీఆర్, హరీష్ రావులు సంతకాలు పెట్టారని తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదన్నారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం చేసిన ఒప్పందానికి విరుద్దంగా కేసీఆర్ మా వాటా నికర, మిగులు జలాలు 713టీఎంసీలు రావాలని, సొంత రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైనందునా కొత్త ట్రిబ్యూనల్ వేయించారని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. పాత కేటాయింపుల ప్రకారం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 299టీఎంసీలు కూడా తెలంగాణ వాడుకోలేదని కేఆర్ఎంబీ గత ఏడాది లేఖ రాసింది..మీకు మిగిలిపోయిన 66టీఎంసీలు వాడుకోమని చెప్పినా కూడా సాగర్ ఎడమ కాలువ కింద పంటలను ఎండబెట్టారని విమర్శించారు. అదే ఏపీ 612టీఎంసీలకంటే కూడా ఎక్కువ వాడుకుంటే తెలంగాణ ప్రభుత్వం వాడుకోలేదని జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు.
అన్యాయం చేసిందే వారు కదా..
ఎస్ ఎల్బీసీ, కృష్ణా నది నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందంటే అది కేవలం టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలతోనే అన్న సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసని జగదీష్ రెడ్డి విమర్శించారు. నది జలాలు తీసుకునే అందుబాటులో ఉన్నా కూడా తగిన ప్రాజెక్టులు కట్టకుండా మహబూబ్ నగర్, నల్లగొండలకు కరవు, ఫ్లోరైడ్ బాధలు మిగిల్చారన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, మంత్రి కోమటిరెడ్డికి తెలంగాణ నది జలాలపైన, ఇరిగేషన్ ప్రాజెక్టులపైన సరైన అవగాహాన లేదన్నారు. అవగాహన లేకుండా కేసీఆర్, హరీష్ రావు సంతకాలు పెట్టి రాష్ట్రానికి అన్యాయం చేశారని మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
సాంకేతిక సర్వే పేరుతో హడావుడి
ఎస్ ఎల్బీబీసీ ప్రాజెక్టు పనుల కోసం హెలిబోర్న్ మ్యాగ్నటిక్ జియో ఫిజికల్ సర్వే పేరుతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హడావుడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 1983లో శ్రీశైలం సొరంగం ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి..2004పనులు మొదలు పెట్టి..ప్రపంచంలోనే ఎక్కడా లేని టీబీఎం మిషన్లను తీసుకొచ్చి ప్రాజెక్టును ఆలస్యం చేసిందే కాంగ్రెస్ పాలకులేనన్న సంగతి వారు మరిచిపోవడం విచారకరం అన్నారు. ఇప్పుడేదో చేస్తున్న సర్వే ఆనాడే చేసి సొరంగం మొదలు పెడితే..ఇప్పుడు కూలిపోవడం వంటి సమస్యలు ఉండేవి కాదన్నారు. ఇప్పటిదాకా సొరంగంలో చనిపోయిన కార్మికుల మృతదేహాలను బయటకు తీసుకరాలేని అసమర్థులని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. 1990కోట్లతో పూర్తి కావాల్సి ఉండేనంటూ మాట్లాడుతున్నారని, పదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు 22కిలోమీటర్లు తవ్వారని, రూ.3665కోట్లు ఖర్చు పెట్టారని, బీఆర్ఎస్ హయాంలో రూ.3895కోట్లు మేం ఖర్చు చేశామన్నారు. అసెంబ్లీలో జానారెడ్డిని, ఉత్తమ్ ను పిలిచి కాంట్రాక్టర్ కు మొబైలేజేషన్ అడ్వాన్ ఇవ్వమంటే కేసీఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. సొరంగం నుంచి నీళ్లు బయటపోసేందుకే రూ.500కోట్ల కరెంటు బిల్లు అయ్యిందని, టీబీఎం మిషన్ చెడిపోతే అమెరికా నుంచి వచ్చేందుకు ప్రతిసారి 6నెలలు పడుతుందన్నారు. అన్ని తప్పులు చేసి..ఇవ్వాళా సర్వే పేరుతో హంగామా చేస్తూ..బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం దారుణమన్నారు.
సాగర్ నీళ్లను వృధాగా వదిలేశారు
చరిత్రలో నాగార్జున సాగర్ చరిత్రలో ఎక్కువ రోజులు గేట్లు ఎత్తి నీళ్లు వదిలారని..అయినప్పటికి ఉదయ సముద్రమంలో నీళ్లు లేవని జగదీష్ రెడ్డి విమర్శించారు. మోటార్ కాలిపోతే బాగుచేయలేక నీళ్లు సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. మీరు చేసిన ద్రోహాలకు ప్రతిదానికి రికార్డు ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో 500టీఎంసీలు ఇచ్చి మిగిలినవన్ని తీసుకపో అంటూ చంద్రబాబుతో గురుదక్షిణ మాటలు మాట్లాడారని మండిపడ్డారు. చంద్రబాబు తెలంగాణకు అన్నిటా ద్రోహం చేశాడని విమర్శించారు. పాలన చేతగాక…శక్తికి మించిన సీఎం పదవి తీసుకుని బీఆర్ఎస్ ను విమర్శించేందుకు రేవంత్ రెడ్డికి సిగ్గు ఉండాలన్నారు. బీమా, నెట్టెంపాడ్ వంటి వాటన్నింటిని కేసీఆర్ పూర్తి చేశారన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. నల్లగొండ నుంచి ఫ్లోరిన్ పారద్రోలి, మహబూబ్ నగర్ వలసలు ఆపిన పాలన కేసీఆర్ సొంతమన్నారు. మీకు పదవలు పైరవీలు, కమిషన్లు తప్ప పాలన చేతకాదన్నారు. కమిషన్ల కోసం కేసీఆర్ ప్రాజెక్టులు కట్టారంటున్న రేవంత్ రెడ్డి, మంత్రులు ఎస్ ఎల్బీసీ పనులను తిరిగి కమిషన్ల కోసమే మొదలు పెడుతున్నారా లేక కమిషన్లు తీసుకునేందుకే హెలికాప్టర్ లలో తిరుగుతున్నారా అంటూ జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.
పరిచయలతో సొరంగంలోని శవాలు బయటకు తీయండి
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పరిచయలతో సాంకేతిక సర్వే కోసం పైలట్లను తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని జగదీష్ రెడ్డి విమర్శించారు. చంచల్ గూడ, చెర్లపల్లి జైలులో నేరస్తులతో ఉన్న పరిచయలతో రేవంత్ రెడ్డి, నీళ్లు, వాటర్ పరిచయాలతో మంత్రి వెంకట్ రెడ్డి ఎవరికి సాధ్యమైన పనులు వారు చేస్తున్నారు తప్ప పరిపాలన చేయడం లేదని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. శవాలను తీసేవారి పరిచయలుంటే తీసుకొచ్చి సొరంగంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీయించాలని హితవు పలికారు. యూరియా ఇచ్చే సోయి లేదని, ధాన్యం, పత్తి కొనుగోలు చేసే సామర్ధ్యం లేదని, విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ లేదని..కమిషన్ల దందాలో మునిగిపోయిన కాంగ్రెస్ పాలకులపైకి రైతన్నలు ముల్లుకర్రలు ప్రయోగించే రోజు దగ్గరలోనే ఉందన్నారు.
పథకాలపై బెదిరింపులు అప్రజాస్వామికం
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే పథకాలు రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి బెదిరించడం దారుణమని.. పథకాలను ఆయన ఏమైనా కొండారెడ్డిపల్లిలో వ్యవసాయం చేసి ఇస్తున్నాడా? అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఏదన్న పథకం రద్దు చేస్తున్నట్టు ప్రకటించు చూద్దాం అని హెచ్చరించారు. సంక్షేమ పథకాలు ఎవడి అబ్బ సొమ్ముతో ఇచ్చేవి కాదు అన్నారు.
