పొన్నం అడుగుజాడల్లో పని చేస్తా

పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ కు ఎన్నో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు తీసుకొచ్చారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తానని

  • Publish Date - April 26, 2024 / 09:20 PM IST

  • అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా
  • కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల

విధాత బ్యూరో, కరీంనగర్: పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ కు ఎన్నో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు తీసుకొచ్చారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తానని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్ మండల కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన‌ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ లో ఆయన మాట్లాడారు.

ఐదు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలోని రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు వీర సైనికుల మాదిరిగా పోరాడారన్నారు. మే13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్న బీజేపీపై పోరాడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. తన తండ్రి జగపతిరావు గుండి గోపాలరావు పేట సర్పంచ్ గా రెండుసార్లు, ఎమ్మెల్యేగా ఒకసారి, ఎమ్మెల్సీగా పనిచేశారని, తమ గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయానికి స్థలం ఇచ్చి ఉచితంగా గుడి కట్టించామని, అయినప్పటికీ ఒకసారి కూడా ఆ మాట చెప్పి ఓట్లు అడగలేదని గుర్తు చేశారు. బీజేపీ నేతలు రాముడు తమ ఒక్కరికే సొంతమైనట్టు, దేవుడి పేరు చెప్పి ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఓట్ల రాజకీయం చేస్తున్న బీజేపీపై ఆయన తప్పక పగ తీర్చుకుంటాడని, రామరాజ్య స్థాపన కోసం పని చేసే కాంగ్రెస్ కు దేవుడితో పాటు ప్రజల దీవెన కూడా తోడయ్యాయని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మూడు నెలల్లోనే ఇచ్చిన హామీల్లో ఐదింటిని అమలు చేసిందన్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీని కూడా అమలు చేస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Latest News