Site icon vidhaatha

One Nation One Election | 2029లో దేశంలో మినీ జమిలి ఎన్నికలు జరిగే అవకాశాలు?

One Nation One Election | ఒకే దేశం.. ఒకే ఎన్నిక! మోదీ ప్రభుత్వం ఎన్నాళ్లుగానో అమల్లోకి తీసుకురావాలనుకుంటున్న ప్రక్రియ. తాజాగా జనాభా లెక్కల సేకరణకు కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌, తదుపరి నియోజకవర్గాల పునర్విభజన అనంతరం మినీ జమిలి (One Nation One Election) నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ 2027లోనే ముగిసే అవకాశాలు ఉన్నాయి. పూర్తి డిజిటలైజ్డ్‌ పద్ధతుల్లో చేపట్టనున్న రీత్యా.. వాటి క్రోడీకరణ కూడా సులభం కానుంది. దీంతో ఆ వివరాలు కూడా తక్కువ వ్యవధిలోనే విడుదల చేసేందుకు అవకాశం ఉంది. మోదీ ప్రభుత్వం చెబుతున్న మరో అంశం నియోజకవర్గాల పునర్విభజన. ప్రస్తుతం లోక్‌సభలో 543 స్థానాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా వాటిని 800కు పెంచుతారనే అంచనాలు ఉన్నాయి. అయితే.. ఈ పెంపుదల ఏ ప్రాతిపదికన చేపడతారన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

నియోజకవర్గాల పునర్విభజన

గతంలో జనాభా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకున్నది. తమ రాష్ట్ర ప్రజల్లో కుటుంబ నియత్రణను ప్రోత్సహించిన రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. దానిలో ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలు విజయవంతమయ్యాయి. ఆర్థిక పురోగతిని కూడా సాధించాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల ప్రాతిపదికన నియోజకవర్గాల విభజనకు సుముఖంగా ఉందనే వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే చైతన్యం ప్రదర్శించి, కుటుంబ నియంత్రణను పాటించిన రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని కొందరు నాయకులు అంటున్నారు. ఎక్కడిదాకానో ఎందుకు.. తెలంగాణలోనే 17 స్థానాలు కాస్తా.. 15కు తగ్గిపోతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పేదరికంలో ఉండి, జనాభా నియంత్రణ పాటించని రాష్ట్రాల్లో మాత్రం నియోజకవర్గాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు సమస్యగా మారింది. కేంద్రం మాట విని, తాము కుటుంబ నియంత్రణను ప్రోత్సహించినందుకు తమ రాష్ట్రాల ప్రయెజనాలను దెబ్బతీయడం సరికాదని దక్షిణాది రాష్ట్రాలు అంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాలన్నింటిపైనా నియోజకవర్గాల సంఖ్యలో మార్పు ప్రభావితం చేయనున్నది. కొన్ని చోట్ల తగ్గిపోతుండగా.. కొన్ని చోట్ల పెరగాల్సిన సంఖ్యలో పెరగడం లేదు. అందుకే జనాభా ప్రాతిపదికన కాకుండా.. ఇప్పుడు ఉన్న నియోజకవర్గాల సంఖ్య నిష్పత్తికి అనుగుణంగా 800 స్థానాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు బలంగా ముందుకు వస్తున్నాయి. లేని పక్షంలో దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మహిళా రిజర్వేషన్‌

2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్‌ కూడా అమలు కానున్నది. దీనిపై గత ఎన్నికలకు ముందుగానే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ఆమోదింపచేసుకున్నది. దీని ప్రకారం చట్టసభల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం దక్కనున్నది. నియోజకవర్గాల పునర్విభజనతోనే ఇది సాకారం కానున్నది. నియోజకవర్గాల పునర్విభజనతో స్థానాలు 800కు పెరిగితే.. సుమారుగా 240 స్థానాల వరకూ మహిళే ప్రాతినిధ్యం వహించనున్నారు.

జమిలికి అవకాశాలు ఉన్నాయా?

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నికను సుసాధ్యం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నది. ఇప్పటికే కమిషన్‌ నివేదికలూ తెప్పించుకున్నది. అయితే.. ఇంకా బిల్లు పెట్టాల్సి ఉన్నది. దీని ప్రకారం లోక్‌సభ ఎన్నికలతోపాటే.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీలకు స్వల్ప విరామాలతో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే.. ప్రస్తుత పరిస్థితిలో 2029లో జమిలి ఎన్నికలకు అవకాశాలు కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కానీ.. మినీ జమిలికి మాత్రం అవకాశాలను కొట్టిపారేయలేమని చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ఒకటి రెండు సంవత్సరాలు ముందు లేదా వెనుక అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలను ఈ మినీ జమిలి ఎన్నికలకు కలిపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వీటిలో గుజరాత్‌ (పదవీకాలం ముగింపు 11.12.2027), హిమాచల్‌ ప్రదేశ్‌ (11.12.2028), ఛత్తీస్‌గఢ్‌ (4.12.2028). మధ్యప్రదేశ్‌ (4.12.2028), రాజస్థాన్‌ (4.12.2028), తెలంగాణ (4.12.2028), మేఘాలయ (22.03.2028), నాగాలాండ్‌ 22.03.2028), త్రిపుర (22.03.2028), కర్ణాటక (13.05.2028), మిజోరం (5.12.2028), ఆంధ్రప్రదేశ్‌ (05.06.2029), అరుణాచల్‌ ప్రదేశ్‌ (5 జూన్ 2029), ఒడిశా (5 జూన్ 2029), సిక్కిం (5 జూన్ 2029), జమ్ము కశ్మీర్ (7 అక్టోబర్ 2029), హర్యానా (7 అక్టోబర్ 2029), మహారాష్ట్ర (22 నవంబర్ 2029), జార్ఖండ్ (22 నవంబర్ 2029) ఉన్నాయి. మొత్తం 19 రాష్ట్రాలు కనిపిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం భావిస్తే ఉత్తరప్రదేశ్‌ను సైతం కలుపుకొనే అవకాశం ఉన్నది. యూపీలో అసెంబ్లీ పదవీకాలం 2027 మే, 22తో ముగియనున్నది. అలా చూసినప్పుడు మొత్తం 20 రాష్ట్రాలతో కలిపి జమిలి ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2029 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించగలిగితే.. తదుపరి ఎన్నికలు పూర్తి స్థాయి జమిలిగా ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. భారతదేశం వంటి భౌగోళిక వైవిధ్యాలు ఉన్న దేశంలో జమిలి, లేదా మినీ జమిలి ఎంత వరకూ ఆచరణ సాధ్యమనే అంశంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఇంతటి భారీ ఎన్నికల ప్రక్రియలో సిబ్బంది నియామకం, వారి తరలింపు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో తీవ్ర సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అన్నింటికి మించి రాజ్యాంగ బిల్లును ఆమోదించడం బీజేపీకి మిత్రుల మద్దతుపై ఆధారపడిన బీజేపీ సాధ్యమయ్యే పనేనా? అనే సందేహాలు ఉన్నాయి. వాస్తవానికి 2029 నాటికే నియోజకవర్గాల పునర్విభజనతో పూర్తి స్థాయి జమిలి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన బీజేపీకి ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జనాభా లెక్కల సేకరణను కూడా అందుకే వాయిదా వేస్తూ వచ్చారని చెబుతున్నారు. తదుపరి నియోజకవర్గాల విభజనకు అత్యంత కీలకమైనది జనాభా లెక్కల సేకరణ. అందుకే దాని సమయాలను అనువుగా నిర్ణయించుకున్నారనే చర్చ జరుగుతున్నది. జనాభా లెక్కల సేకరణ పూర్తి, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌ అమలు.. అవకాశాలను బట్టి మినీ జమిలి.. ఇలా ఈ అంశాలన్నీ గమనిస్తే.. 2029 సంవత్సరం.. భారత దేశ రాజకీయాల విషయంలో ఒక గుణాత్మక మార్పునకు పునాదిగా నిలిచే అవకాశాలు మాత్రం సుస్పష్టంగా కనిపిస్తున్నాయి.

Exit mobile version