ఇండోర్‌లో కాంగ్రెస్‌కు సొంత అభ్యర్థి బామ్ షాక్
ఇండోర్: ఎట్టిపరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్న బీజేపీ.. ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థికి వల వేసింది. మరో 15 రోజులలో ఇండోర్ లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరుగనున్నది. ఈలోపే సోమవారం ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్‌బామ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకుని, బీజేపీలో చేరిపోయారు. అక్షయ్‌బామ్ లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేయడం ఇదే తొలిసారి. బామ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారని ఇండోర్ కలెక్టర్ అశిష్ సింగ్ ధృవీకరించారు. కారులో తనతోపాటు అక్షయ్‌బామ్ కూర్చొని ఉన్న ఫొటోను కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి కైలాశ్ విజయ్‌వర్గియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వీడీ శర్మ నాయకత్వంలో పనిచేసేందుకు ఇండోర్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్‌కు స్వాగతం’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. విజయ్ వర్గియ కారులో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ మెండోలా కూడా ఉన్నారు. విజయవర్గియాకు ఆయన అత్యంత విశ్వసనీయుడని చెబుతారు. ఎన్నికలకు కొత్త అయిన బామ్ (45)ను బీజేపీ సిటింగ్ ఎంపీ శంకర్ లాల్వానీ (62)పై కాంగ్రెస్ పోటీకి దింపింది. ఇండోర్‌లో బీజేపీకి గట్టి పట్టున్నదని చెబుతారు. మే 13న పోలింగ్ జరుగాల్సి ఉండగా.. ఈలోపే బీజేపీ తనకు ఎదురులేకుండా చూసుకున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బామ్ తన నామినేషన్ ఉపసంహరించుకున్న నేపథ్యంలో పత్రకార్ కాలనీలోని బామ్ నివాసం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నామినేషన్ ఉపసంహరణ నేపథ్యంలో పలువురు స్థానిక కాంగ్రెస్ నేతలు ఆయన ఇంటి వద్ద గుమిగూడారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు సహా పలువురు పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్‌ను వదిలి, బీజేపీలో చేరిన నేపథ్యంలో ఆ పార్టీ బామ్‌కు అవకాశం కల్పించింది.
ఓటర్ల పరంగా మధ్యప్రదేశ్‌లోని అతిపెద్ద నియోజకవర్గం ఇండోర్. ఇక్కడ దాదాపు 25.13 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి ఈ సీటును తాము 8 లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుచుకుంటామని బీజేపీ నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
‘భయంతోనే ఇది జరిగింది. ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలకు, అన్ని మతాల ప్రజలకు సమాన భాగస్వామ్యం కల్పించడం అతి ముఖ్యం’ అని కాంగ్రెస్ నేత సుభాషిణి శరద్‌యాదవ్ ఒక వార్తా సంస్థకు చెప్పారు. ఇంతకు ముందు సూరత్‌లో ఇదే జరిగిందని, ఇప్పుడు ఇండోర్‌లో జరుగుతున్నదని అన్నారు. తమ పార్టీ బలహీనంగా ఏమీ లేదని స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎలా హత్య చేస్తున్నారో తెలుసుకునేందుకు ఇదొక సాక్ష్యమని వ్యాఖ్యానించారు.