రైతులకు భరోసా ఇచ్చేందుకే రైతు దీక్ష: బండి సంజయ్

శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలు ఇచ్చి, వందరోజుల వ్యవధిలో వాటిని అమలు చేస్తామని నమ్మబలికి ప్రస్తుతం చేతులెత్తేసిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు

  • Publish Date - April 2, 2024 / 12:16 PM IST

కాంగ్రెస్ హామీలను నమ్మి రైతులు మోసపోయారు
నష్టపోయిన పంటలకు పరిహారం, రెండు లక్షల

రుణమాఫీ అమలుకు డిమాండ్

రైతు దీక్షలో బండి సంజయ్

విధాత బ్యూరో, కరీంనగర్: శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలు ఇచ్చి, వందరోజుల వ్యవధిలో వాటిని అమలు చేస్తామని నమ్మబలికి ప్రస్తుతం చేతులెత్తేసిందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ఓటేసిన రైతులు మోసపోయారని ఆయన చెప్పారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మంగళవారం ఒకరోజు రైతుదీక్ష సంజయ్ చేపట్టారు

కాంగ్రెస్ మోసాలను ఎండగట్టి రైతులకు భరోసా కల్పించేందుకే రైతు దీక్ష చేపట్టాల్సి వచ్చిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ వాటి అమలులో వైఫల్యం చెందిందన్నారు. ప్రసార మాధ్యమాల్లో కోట్లాది రూపాయలతో ప్రకటనలు గుప్పిస్తూ 6 గ్యారంటీలను అమలు చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు జరుగుతున్న పక్షంలో రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ అంశం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామన్న హామీ ఏమైందని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతున్న తరుణంలో రైతులు పండించిన ధాన్యానికి వెంటనే బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

గతంలో మాదిరిగా తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా రైతులు పండించిన ప్రతి వడ్ల గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. సమగ్ర పంటల బీమా పథకాన్ని ఎందుకు తీసుకురాలేదని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా పంటలు నష్టపోయారని, చేతికందిన పంట నీళ్లు పాలైందని తెలిపారు. మరోవైపు సాగునీరు లేక పంట ఎండిపోయి రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదన్నారు.

జిల్లాలో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు. రైతు భరోసా కింద రైతులతో, కౌలు రైతులకు రూ.15 వేలు చెల్లించాలన్నారు. రైతు కూలీలకు సైతం ఏటా రూ.12 వేల ఇవ్వాలని కోరారు. కేంద్రం ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయకుండా, పంటల బీమాను అమలులోకి తేకుండా రైతులెలా బతుకుతారని ప్రశ్నించారు.

Latest News