Kavitha Sensation | ‘కల్వకుంట్ల’ కవిత సంచలనం : కేసీఆర్‌ ఫోటో లేకుండా తెలంగాణ యాత్ర

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అక్టోబర్‌ చివరి వారంలో “తెలంగాణ యాత్ర” ప్రారంభించనున్నారు. కేసీఆర్‌ ఫోటో లేకుండా ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రంతో యాత్ర పోస్టర్‌ సిద్ధమైంది.

Kavitha Creates Buzz: Telangana Tour Without KCR’s Photo

Kalvakuntla Kavitha’s Telangana Yatra Without KCR’s Photo Stirs Debate

హైదరాబాద్‌, అక్టోబర్‌ 14:

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రవ్యాప్తంగా “తెలంగాణ యాత్ర” చేపట్టనున్నారు. అక్టోబర్‌ చివరి వారంలో ఈ యాత్ర ప్రారంభం కానుందని సమాచారం. ప్రతి జిల్లాలో ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తూ, వారి సమస్యలు తెలుసుకోవడమే కాకుండా తెలంగాణ ఆత్మను మరోసారి చైతన్యం చేయడం ప్రధాన లక్ష్యమని కవిత ప్రకటించారు.

ఈ యాత్రలో ముఖ్యమైన నిర్ణయం – మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఫోటో లేకుండా యాత్రను నిర్వహించడం. పోస్టర్లు, బ్యానర్లలో ఆయన చిత్రాన్ని వాడకుండా, ఆ స్థానంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఫోటోను ఉపయోగించనున్నారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కవిత ఈ యాత్రను “రాజకీయ యాత్ర”గా కాకుండా, “తెలంగాణ స్వరం వినిపించే ప్రజా యాత్ర”గా చెప్పుకొచ్చారు. బుధవారం జాగృతి కార్యాలయంలో అధికారిక పోస్టర్‌ విడుదల చేయనున్నారు. ఈ పోస్టర్‌ డిజైన్‌ పూర్తిగా తెలంగాణ మట్టి, సాంస్కృతిక వాసనలతో రూపొందించారని తెలిసింది. పోస్టర్‌ విడుదల తర్వాత యాత్ర షెడ్యూల్‌, మార్గం, ప్రారంభ స్థలం, సమావేశాల తేదీల వివరాలు ప్రకటించనున్నారు. ఈ యాత్ర రాష్ట్రంలోని 33 జిల్లాల మీదుగా సాగనుంది.

పల్లెలు, పట్టణాలు, విద్యాసంస్థలు, సాంస్కృతిక కేంద్రాలను సందర్శిస్తూ కవిత ప్రజలతో ప్రత్యక్ష సంబంధాన్ని పెంపొందించనున్నారు. ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాలు, విద్యార్థి సమాఖ్యలు, సామాజిక సంస్థలతో సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో సాధించిన విజయాలు, ఇంకా చేయాల్సిన పనులు, కొత్త తరానికి తెలంగాణ ఉద్యమ స్పూర్తి తెలియజేయడమే ఈ యాత్ర ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఇటీవల కవిత పలు విద్యావేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు, బీసీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ భవిష్యత్తు, మహిళా సాధికారత, సామాజిక సమానత్వం వంటి అంశాలపై చర్చించారు. “ప్రొఫెసర్‌ జయశంకర్‌ కలల తెలంగాణను సాకారం చేసుకోవాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి” అని ఆమె అన్నారు.

ఈ యాత్ర బీఆర్‌ఎస్‌ భవిష్యత్తు దిశను ప్రభావితం చేయగలదా? లేదా?, అలాగే కవిత స్వతంత్ర రాజకీయ గుర్తింపుకు దారి తీస్తుందా అనేది వేచి చూడాల్సిన అంశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్దం తర్వాత, “తెలంగాణ జాగృతి” మళ్లీ ప్రజల్లో చైతన్యం కలిగించడానికి తీసుకుంటున్న ఈ చర్య రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు కారణమవుతుందనే అంచనాలు ఉన్నాయి.