అబద్ధాలలో మోదీని కిషన్‌రెడ్డి మించిపోయారు … సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

బొగ్గు గనుల కేటాయింపు విషయంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి మాటలు చూస్తే ఆయన అబద్ధాల్లో ప్రధాని మోదీనే మించిపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు.

  • Publish Date - June 30, 2024 / 04:31 PM IST

సింగరేణికి కేంద్రం బొగ్గు గనులు కేటాయించాలి
5 వ తేదీన కోల్డ్ బెల్ట్‌ బంద్ చేసి, కలెక్టరేట్ల ముట్టడి
కమ్యూనిస్టుల సైద్ధాంతిక పోరాటంతోనే బీజేపీకి తగ్గిన సీట్లు
కుదిరితే పొత్తులతో..లేదంటే సొంతంగానే బలోపేతం

విధాత, హైదరాబాద్ : బొగ్గు గనుల కేటాయింపు విషయంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి మాటలు చూస్తే ఆయన అబద్ధాల్లో ప్రధాని మోదీనే మించిపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ మహాసభలను ఆదివారం ఖమ్మంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ఒరిస్సా, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బొగ్గు గనులను ప్రభుత్వానికి ఇచ్చారని గుర్తుచేశారు, కిషన్ రెడ్డి ప్రధాని మోదీతో మాట్లాడి తెలంగాణలో ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న గనులను ప్రభుత్వానికి ఇప్పించేలా కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సమస్యలపై రాష్ట్ర ప్రయోజనాలు..పార్టీ విధానాల మేరకు దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరముందన్నారు. సింగరేణి బొగ్గు గనుల సాధనకు జూలై 5 వ తేదీన కోల్డ్ బెల్ట్‌ని బంద్ చేసి, కలెక్టరేట్లను ముట్టడి చేస్తామని హెచ్చరించారు. బీజేపీ, కేసీఆర్ రెండు ఒక్కటేనని, కేసీఆర్ ఇప్పుడు సింగరేణిపై ముసలి కన్నీరు కారుస్తున్నారని సెటైర్లు చేశారు. కేసీఆర్ ఇప్పుడు పోరాటం చేస్తామని చెబుతున్నారని.. పోరాటాలు చేసేది కేవలం కమ్యూనిస్ట్‌లు మాత్రమేనని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ తమతో కలిసి కేంద్రంపై పోరాటాలకు రోడ్ల మీదకు రావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి గొప్ప సంపద బొగ్గు గనులు, దాని మీద ఎక్కువ హక్కులు మాకే ఉన్నాయని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.

సొంత ప్రయత్నాలతో బలోపేతం..

కమ్యూనిస్టుల బలాన్ని విస్తృత పరచాలి అనుకుంటున్నామని, కమ్యూనిస్టులతో కలిసొచ్చే పార్టీలతో పొత్తులు కుదిరితే సంతోషమని, లేకుంటే సొంతంగా ముందుకెళ్తామని కూనంనేని స్పష్టం చేశారు. బీజేపీకి ప్రత్యామ్నయంగా కాంగ్రెస్ నిలబడాలని మేము కోరుకుంటామని, కాంగ్రెస్ ప్రజల సమస్యల పట్ల ఆలోచించకుంటే మేము వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తన సొంత బలంతో గెలుపొందలేదని, బీఆరెస్‌ బలహీనం అయిన చోట బీజేపీ పుంజుకుందని, బీఆరెస్ బలహీనం అయిన చోట ప్రత్యామ్నాయంగా మేం నిలబడే ప్రయత్నం చేస్తామన్నారు. బీఆరెస్‌ సెంటిమెంట్‌పై ఏర్పడిన పార్టీ అని, సెంటిమెంట్‌కు రాష్ట్రా సాధనతో కాలం చెల్లిపోవడంతో బీఆరెస్ కూడా అదే రీతిలో బలహీనమవుతుందన్నారు. ఇక్కడ బీఆరెస్‌ స్థానాన్ని భర్తీ చేయాలి అనుకుంటే ఆ స్థానంలో కాంగ్రెస్ లేదా కమ్యూనిస్ట్ పార్టీలకు ప్రజలు మద్దతు చూపుతారని ఆశిస్తున్నామన్నారు. అందుకు రాజకీయంగా ఎదిగేందుకు అన్ని రంగాల్లో నిష్ణాతులైన కార్యకర్తలను తయారు చేయాలని చూస్తున్నామన్నారు.

కమ్యూనిస్టులతోనే బీజేపీకి చెక్‌

సీపీఐ బలంగా ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందిందని, తమిళనాడు వంటి ప్రాంతాల్లో కమ్యూనిస్టుల పట్ల ప్రజల్లో ఉన్న అభిమానాన్ని గుర్తించామని కూనంనేని తెలిపారు. కమ్యూనిస్టులకు కోట్ల మంది ప్రజలు ఆదరణ లభిస్తుందని, బీజేపీ 400 స్థానాలు దాటాలని చెప్పిందని, 240 స్థానాలకు పడిపోవడం వెనుక కమ్యూనిస్టుల సైద్ధాంతిక పోరాటం ఉందని గమనించాలని తెలిపారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను జనాల్లోకి తీసుకెళ్లడం కమ్యూనిస్టులతోనే సాధ్యమన్నారు. బీజేపీ అయోధ్య వంటి స్థానాల్లో ఓడిపోవడం, జనరల్ స్థానంలో దళితుడు పోటీ చేసి గెలవడం కమ్యూనిస్టుల ప్రభావితం కారణంగానే జరిగాయని కూనంనేని చెప్పుకొచ్చారు.

Latest News