Kishan Reddy | ఏపీ అల్లర్లపై కఠినంగా వ్యవహరించాలి: కిషన్‌రెడ్డి

ఏపీలో ఎన్నికల సందర్భంగా తలెత్తిన అల్లర్లపై కేంద్ర ఎన్నికల కమిషన్, ఏపీ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు

  • Publish Date - May 15, 2024 / 07:14 PM IST

ఏపీలో ఎన్డీఏ కూటమిదే గెలుపు
తెలంగాణలో బీజేపీకి డబుల్‌ డిజిట్‌ సీట్లు
కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి

విధాత: ఏపీలో ఎన్నికల సందర్భంగా తలెత్తిన అల్లర్లపై కేంద్ర ఎన్నికల కమిషన్, ఏపీ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని.. ఎన్డీఏ కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో కొంత నిరాశ, నిస్పృహలతో అల్లర్లు జరిగి ఉండొచ్చని తెలిపారు. ప్రజల్లో మార్పు రావడంతో అభ్యర్థులు గొడవకు దిగారన్నారు. తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పుకొచ్చారు.

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌లు రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీపై పోటీ పడి మరి చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు ఎవరు నమ్మలేదని, తెలంగాణ ప్రజలు మోడీకి అండగా నిలిచారని చెప్పారు. కాంగ్రెస్, బీఆరెస్‌ల అసత్యాలను ప్రజలు నమ్మకపోగా, తెలంగాణలో ఎవరు గెలిచినా.. మేమే కీలకం అన్నట్లు మజ్లిస్ వ్యవహరించిన తీరు కూడా బీజేపీకి అనుకూలంగా మారిందన్నారు. తెలంగాణకు 11లక్షల కోట్లు ఇచ్చిన బీజేపీపై రేవంత్‌రెడ్డి గాడిద గుడ్డుతో చేసిన ప్రచారంలో కాంగ్రెస్ గుర్తు మారిపోయిందేమోనని ఎద్దేవా చేశారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం కనబడుతోందని డబుల్‌ డిజిట్‌ స్థానాలు గెలుస్తామన్నారు.

మల్కాజ్ గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్‌లో బీజేపీకి కొంత ఓట్ల శాతం తగ్గిందని చెప్పారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు కొన్ని ఓట్లను కాంగ్రెస్ కుట్రతో తీసేశారని ఆరోపించారు. రేపు ఎన్నికల కమిషన్‌కి ఓట్ల తీసేయడం పై ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికల ఫలితాల పై ఎలాంటి ప్రభావం ఉండదని.. ఓటర్ కార్డును ఆధార్‌కి లింక్ చేయాలని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆరెస్‌లకు తెలంగాణలో బీజేపీ సరైన ప్రత్యామ్నాయంగా అవతరించబోతోందని, తెలంగాణ రాజకీయాల్లో బీఆరెస్‌ పార్టీ అస్తిత్వం కోల్పోనుందన్నారు. జూన్ 4వ తేదీన అందరిని ఆశ్చర్యపరిచేలా ఫలితాలు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమికి 400 సీట్లు రాబోతున్నాయన్నారు.

తెలంగాణకు ఆర్థిక సంక్షోభ ముప్పు

రానున్న రోజుల్లో తెలంగాణలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉందన్నారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్‌ గ్యారంటీల కరపత్రం వెళ్లిందని.. 100 రోజుల్లో అన్ని అమలు చేస్తామని చెప్పారని, తెలంగాణలో ఒక్క బస్సు పథకం మాత్రమే నడుస్తుందని.. దానికి ఆర్టీసీకి నిధులు చెల్లించడం లేదని పేర్కోన్నారు. మహిళలకు రూ.2 వేలు, నిరుద్యోగ భృతి, రైతు కూలీలకు రూ. 12 వేలు, తులం బంగారం అన్నారని.. వాటిని కూడా ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. 420 హామీలు రేవంత్ రెడ్డి ఇచ్చారని.. ఇచ్చిన హామీలపై రేవంత్ దృష్టి పెట్టాలని అన్నారు.

కాంగ్రెస్ హామీలు నెరవేర్చాలని ప్రజల పక్షాన తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. నీచమైన రాజకీయాలు దిగజారాకుండా రేవంత్ రెడ్డి వ్యవహరించాలని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉందన్నారు. ఆర్థిక వనరుల సమీకరణ ఏవిధంగా చేయబోతున్నారో చెప్పాలన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ పథకాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేయాలన్నారు. రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రానికి వచ్చారని.. ఆ హామీలు నెరవేర్చకుండా మళ్లీ పార్లమెంట్ ఎన్నికలకు కూడా కొత్త హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.

Latest News