విధాత, హైదరాబాద్ : రాష్ట్ర రాజధానిలోని పారిశ్రామిక భూముల రేగ్యులరైజేషన్ పేరుతో రూ.5 లక్షల కోట్ల రూపాయల స్కామ్‌కు సీఎం రేవంత్ రెడ్డి తెరలేపాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (HILTP) పేరిట రేవంత్ రెడ్డి రూ. 5 లక్షల కోట్ల విలువైన భూకుంభకోణానికి పాల్పడాలని చూస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ ముసుగులో, రేవంత్ రెడ్డి భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి కుట్ర చేశారని, ఇది కేవలం పాలసీ కాదు. రూ. 5 లక్షల కోట్ల స్కామ్ కోసం రూపొందించిన బ్లూప్రింట్ అని కేటీఆర్ ఆరోపించారు. లక్షల కోట్ల విలువైన భూమిని అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వం అప్పగించబోతుందని, వెంటనే ప్రభుత్వం ఈ పాలసీని రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఏటీఎంగా హెచ్‌ఐఎల్‌టీపీ
కాంగ్రెస్ ఏటీఎంగా హెచ్‌ఐఎల్‌టీపీని మార్చారని, హెచ్‌ఐఎల్‌టీపీ వెనుక ఉన్న ఉద్దేశం పట్టణాభివృద్ధి కాదని, ఎంపిక చేసిన కొద్దిమందిని పెద్దఎత్తున ధనవంతులుగా మార్చడమేనని అని కేటీఆర్ ఆరోపించారు.
ఒకప్పుడు ప్రజల వద్ద పారిశ్రామిక అవసరాల కోసం రైతుల వద్ద తీసుకున్న భూమిని ప్రైవేట్ వ్యక్తులకు తక్కువ ధరకు అప్పగిస్తుందని, అనేక రెట్లు మార్కెట్ విలువ ఎక్కువ ఉన్న ఈ భూములను, కేవలం 30% ఎస్ఆర్ఓ రేట్లకి రెగ్యులరైజ్ చేయడం అవినీతికి నిదర్శనం అని కేటీఆర్ ఆరోపించారు. ఇది కేవలం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, సన్నిహితంగా ఉండే రాజకీయ మధ్యవర్తులు, బంధువులు, రియల్ ఎస్టేట్ గ్రూపులకు లబ్ధి చేకూర్చేందుకే రూపొందించబడిన పాలసీ అని ధ్వజమెత్తారు. ఈ పాలసీలో ఎవరైన భూములు కొంటే తాము అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేస్తామని పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ హెచ్చరించారు.
9,292 ఎకరాల విలువైన భూమికి ఎసరు
బాలానగర్, జీడిమెట్ల, సనత్‌నగర్, అజామాబాద్‌తో సహా హైదరాబాద్‌లోని కీలకమైన పారిశ్రామిక క్లస్టర్‌లలో ఉన్న సుమారు 9,292 ఎకరాల విలువైన భూమిని క్రమబద్ధీకరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నూతన పాలసీ ద్వారా ప్రయత్నిస్తోందని కేటీఆర్ తెలిపారు. ఈ భూముల మార్కెట్ విలువ ప్రస్తుతం ఎకరాకు రూ. 40 నుంచి 50 కోట్ల వరకు ఉందని, దీని మొత్తం విలువ రూ. 4 లక్షల కోట్ల నుంచి రూ. 5 లక్షల కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేశారు. ఆ భూములను రేవంత్ కేవలం ప్రభుత్వ విలువలో 30% కే అప్పగించాలని చూస్తున్నారు, అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము అజామాబాద్ పారిశ్రామిక భూములను క్రమబద్ధీకరించినప్పుడు, ఎస్ఆర్‌ఓ రేట్ల కంటే 100% నుండి 200% అధికంగా వసూలు చేయాలని ఒక చట్టం చేశామన్నారు. కానీ కాంగ్రెస్ కేవలం 30% కే చేయాలని చూస్తోంది. ఎందుకు? ఎవరికి లాభం చేకూర్చడానికి? అని ప్రశ్నించారు. మార్కెట్ ధరలు, ఎస్ఆర్‌ఓ విలువ కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఆయన వాదించారు. కనీసం ఎస్ఆర్‌ఓను కూడా పూర్తిగా వసూలు చేయడం లేదు. కేవలం 30% మాత్రమే తీసుకుంటున్నారు. మిగిలిన లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్తాయి, అని ఆరోపించారు.
మేం నిరాకరించాం..రేవంత్ రెడ్డి చేస్తున్నారు
ఉత్పత్తిని పెంచడానికి, ఉద్యోగాలు సృష్టించడానికి ప్రభుత్వాలు రాయితీ ధరలకే పారిశ్రామిక భూమిని ఇచ్చాయని..కానీ ఇప్పుడు, అవే భూములను ప్రైవేట్ వ్యక్తుల లాభాల కోసం క్రమబద్ధీకరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా అనేక మంది భూ యజమానులు, బ్రోకర్లు అత్యంత తక్కువ ధరలకు క్రమబద్ధీకరణ కోసం తనను సంప్రదించారని, అయితే తాము ఆ ప్రతిపాదనలను తిరస్కరించామని కేటీఆర్ వెల్లడించారు. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ ప్రయోజనం కోసం చౌకగా ఇవ్వలేము. మేము అప్పుడు తిరస్కరించాం. కానీ మేము ఆపిన పనినే ఇప్పుడు రేవంత్ చేస్తున్నారు, అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
అవినీతి కోసమే ఆగమేఘాలపై క్రమబద్దీకరణ
హెచ్‌ఐఎల్‌టీపీ పాలసీని ప్రభుత్వం ఆమోదించే వేగం అత్యంత అనుమానాస్పదంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. 7 రోజుల్లో దరఖాస్తులు, 7 రోజుల్లో ఆమోదాలు, 45 రోజుల్లో పూర్తి క్రమబద్ధీకరణ చేయమని చెప్పడం పై అనుమానం వ్యక్తం చేశారు. లక్షల కోట్ల విలువైన భూముల అంశంలో
ఎందుకీ తొందర? ఎందుకీ వేగవంతమైన ప్రక్రియ? అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సోదరులు, అనుచరులు మరియు మధ్యవర్తులు ఇప్పటికే ఈ భూముల కోసం ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. పాలసీ ఆమోదం పొందడానికి ముందే డీల్స్ కుదిరాయని ఆయన తెలిపారు.
రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన కంటే రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ముందు మూసీ నదీ తీరంలోని భూములు, తర్వాత మెట్రో రైలు భూములు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూములు. ఇప్పుడు 9,292 ఎకరాల పారిశ్రామిక భూములు. రేవంత్ దృష్టి కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమే అని నిరూపించుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి చుట్టూ భూ డీలర్లు ఉన్నారు. ఆయన సోదరులు, సన్నిహితులు ఇప్పటికే ఈ భూముల కోసం ఒప్పందాలు చేసుకున్నారు. అందుకే హెచ్‌ఐఎల్‌టీపీ పాలసీ అమలుకు తొందరపెడుతున్నారు అని కేటీఆర్ ఆరోపించారు.
ప్రజల భూమిని చౌక ధరలకు అప్పగిస్తున్నారు
ఇందిరమ్మ ఇళ్లు, స్మశాన వాటికలకు కూడా స్థలం లేని హైదరాబాద్‌లో, ప్రభుత్వం ప్రజల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లేదా స్మశాన వాటికలకు కూడా భూమి దొరకని నగరంలో, రేవంత్ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని, ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలని లేదా ముంబై మాదిరిగా బహిరంగ వేలం వేయాలని అన్నారు. దానికి బదులుగా, వారు రూ. 5 లక్షల కోట్లు దోచుకోవాలని, కనీసం రూ. 50,000 కోట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత జేబులో వేసుకోవాలని చూస్తున్నారుఅని కేటీఆర్ ఆరోపించారు.
పారిశ్రామికవేత్తలు, డెవలపర్‌లకు హెచ్చరిక
హెచ్‌ఐఎల్‌టీపీ కింద డీల్స్ కుదుర్చుకునే వారికి..ఈ పాలసీ కింద భూమి కొనుగోలు చేసే పారిశ్రామికవేత్తలకు బీఆర్ఎస్ హెచ్చరిక చేస్తుందని.. భవిష్యత్తులో వారు తీవ్రమైన న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటారని.. ఈ లావాదేవీలు నిలబడవు అని.. ఆ భూమిని తిరిగి తీసుకుంటాం అని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమబద్ధీకరణను రద్దు చేసి, తగిన చర్యలు ప్రారంభిస్తుందని ఆయన అన్నారు. మేము పూర్తి స్థాయి విచారణ జరుపుతామని, ఈ కుంభకోణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటాం. ఈ స్కామ్‌లో పాల్గొనే ఎవరినీ వదిలిపెట్టం,అని స్పష్టం చేశారు.
వెంటనే పాలసీని ఉపసంహరించుకోవాలి
హెచ్‌ఐఎల్‌టీపీ పాలసీని వెంటనే ఉపసంహరించుకోవాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కనీసం, ప్రభుత్వం 50% భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని, మిగిలిన 50% క్రమబద్ధీకరించాలి. కానీ కాంగ్రెస్ 100% భూమిని చౌక ధరలకు క్రమబద్ధీకరించాలని చూస్తోంది. ఇది ఆమోదయోగ్యం కాదు అని అన్నారు. ముంబై లాంటి మెట్రో నగరాల్లో ఇలాంటి భూములను వేలం వేసి ప్రభుత్వం ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఖజానాకు చేరుస్తుంటే..ఇక్కడ మాత్రం అప్పనంగా సంపూర్ణంగా ప్రైవేట్ వ్యక్తుల లబ్ది కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు.
భూ స్కామ్ పై బీజేపీ స్పందించాలి
హెచ్‌ఐఎల్‌టీపీ పాలసీ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి చేయబోతున్న భూ స్కామ్ పై బీజేపీ స్పందించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దీనిని వ్యతిరేకించాలి. మౌనంగా ఉంటే, కాంగ్రెస్, బీజేపీ కలసిపోయాయని అర్థం అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. కాంగ్రెస్ రూ. 5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని దోచుకోవడానికి ప్రయత్నిస్తోందని.. ఇది అభివృద్ధి కాదు, ఇది పగటిపూట దోపిడీ అని కేటీఆర్ విమర్శించారు.
