Telangana Maoist free state| మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణ !?

ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమానికి పట్టుగొమ్మగా మారిన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం మావోయిస్టు రహిత రాష్ట్రంగా అవిర్భవించబోతుంది. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి , మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనే నరసింహారెడ్డి సహా 15మంది తాజాగా తెలంగాణ ఎస్ఐబీ ముందు లొంగిపోవడంతో .. మావోయిస్టు పార్టీ ఉనికి తెలంగాణలో కనుమరుగైనట్లుగా పోలీసులు వెల్లడిస్తున్నారు.

విధాత, హైదరాబాద్ : ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమానికి పట్టుగొమ్మగా మారిన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం మావోయిస్టు రహిత రాష్ట్రంగా అవిర్భవించబోతుంది. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి,  మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనే నరసింహారెడ్డి సహా 15మంది తాజాగా తెలంగాణ ఎస్ఐబీ ముందు లొంగిపోవడంతో ..  మావోయిస్టు పార్టీ ఉనికి తెలంగాణలో కనుమరుగైనట్లుగా పోలీసులు వెల్లడిస్తున్నారు.  మాజీ కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి నేపాల్ లో తలదాచుకున్నారని, దీంతో తెలంగాణలో మావోయిస్టు ఉద్యమ ప్రస్థానానికి ఎండ్ కార్డ్ పడినట్లేనంటుంది పోలీస్ శాఖ.  ఇంకాసేపట్లో మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటుపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అధికారిక ప్రకటన చేయనున్నారు.

మావోయిస్టు ఏరివేత ఆపరేషనల్లో తెలంగాణ ఎస్ఐబీ రికార్డ్

మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లలో తెలంగాణ ఇంటలిజెన్స్ లో భాగమైన ఎస్ఐబీ పోషించిన పాత్ర కీలకంగా మారింది. ఎస్ఐబీ ఆపరేషన్ల నేపథ్యంలో ఇప్పటి వరకు 14,078 క్యాడర్లు అరెస్టు కాబడగా..5,865 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 1289 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. 1,057 ఎన్‌కౌంటర్ ఘటనలు నమోదయ్యాయి. 23 మంది కేంద్ర కమిటీ సభ్యుల సమాచార సేకరణలో ఎస్ఐబీ నిరంతరం పనిచేసింది. వీరిలో 7 మంది కేంద్ర కమిటీ సభ్యుల అరెస్టు కాబడగా, మరో 7 మంది కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోయారు. 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఎన్‌కౌంటర్ లలో మృతి చెందారు. గత రెండేండ్లలో సుమారు 600 మంది అజ్ఞాత తీవ్రవాదులు తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోయారు. మొత్తం 21,232 మంది మావోయిస్టుల ఏరివేతలో తెలంగాణ ఎస్ఐబీ కీలక పాత్ర పోషించింది.

తెలుగు గడ్డపై 40ఏళ్ల మావోయిస్టు ఉద్యమానికి తెరపడినట్లేనా..!

భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం మొదలైన నక్సల్బరీ ఉద్యమం 1967లో పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్బరీ గ్రామంలో పురుడు పోసుకుంది. 1967 నక్సల్బరీ తిరుగుబాటుతో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) చీలిక ఏర్పడి 22 ఏప్రిల్ 1969లో చారుమజుందార్, కానూ సన్యాల్ సారధ్యంలో ఏప్రిల్ 1969లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) ఏర్పాటుకు దారితీసింది. దున్నేవాడిదే భూమి.. చైనా విప్లవోద్యమకర్త మావో చెప్పిన.. వర్గశతృ నిర్మూలన, సాయుధ పోరాటాల ద్వారానే నూతన ప్రజాస్వామిక విప్లవం సాధ్యమవుతుందన్న నినాదంతో నక్సల్బరీ ఉద్యమం కొనసాగింది. నక్బల్బరీ ఉద్యమ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం జిల్లాలోని అడవి ప్రాంతాలలో 1969లో (అప్పర్ అవిరి, బోతిలి కొండలు) భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా గిరిజన రైతాంగ సాయుధ పోరాటంతో తెలుగు గడ్డపై నక్సలైట్ ఉద్యమం రాజుకుంది. వంపతాపు సత్యనారాయణ, అదిభట్ల కైలాసం వంటి నాయకత్వంలో గిరిజనుల హక్కుల కోసం ఈ ఉద్యమం ఉధృతమైంది. ఇదే క్రమంలో కొండపల్లి సీతారామయ్య 22 ఏప్రిల్ 1980న సీపీఐ(ఎంల్) పీపుల్స్ వార్ గ్రూప్ (PWG) ను స్థాపించారు. కాలక్రమేణా పీపుల్స్ వార్ పార్టీ గెరిల్లా పోరాటాలతో బలపడిన నక్సలైట్ ఉద్యమం పోలీసు బలగాలతో తీవ్ర ఘర్షణల మధ్య విస్తరించింది.

పీపుల్స్ వార్ తో బలపడి..మావోయిస్టులుగా విస్తరించి…

పీపుల్స్ వార్ నక్సలైట్ ఉద్యమం శ్రీకాకుళం భూపోరాటాలు మొదలుకుని..తెలంగాణలోని సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతాల్లో జరిగిన రైతు కూలీ పోరాటాలతో ఉప్పెనలా తెలుగు రాష్ట్రమంతా విస్తరించింది. ప్రజాప్రతినిధులపై దాడులు, ప్రజాకోర్టుల నిర్వహణతో ఉమ్మడి ఏపీ వ్యాప్తంగా బలపడింది. ఇదే క్రమంలో డిసెంబర్ 2, 2000న, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అని పిలువబడే మావోయిస్టుల సాయుధ విభాగం స్థాపించబడింది. సెప్టెంబర్ 2004లో పీపుల్స్ వార్ గ్రూప్, మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా విలీనం ద్వారా సీపీఐ-మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు భారత్ దేశ వ్యాప్తంగా విస్తరించిన మావోయిస్టు పార్టీ ఓ దశలో 16రాష్ట్రాలు, 200జిల్లాలో తన కార్యకలాపాలు కొనసాగించింది. చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, బీహార్, జార్ఘండ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు మావోయిస్టు ప్రభావిత 184జిల్లాల పరిధిలో రెడ్ కారిడార్ పేరుతో పిలిచే ప్రాంతంలో ప్రభుత్వాలకు పోటీగా జనథన్ సర్కర్ ను నడిపించే స్థాయికి ఎదిగింది. మావోయిస్టు పార్టీ విస్తరణలో తెలుగు రాష్ట్రాల కేడర్ కీలకంగా వ్యవహరించడం ఈ సందర్బంగా గమనార్హం.

దాడులు..ప్రతిదాడులలో దద్దరిల్లిన తెలుగు రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాలలో నక్సలైట్ ఉద్యమ క్రమంలో  నక్సలైట్లు భారీగా హింసాత్మక, విధ్వంసక దాడులు సాగించారు.  ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులతో పాటు, ఇన్ ఫార్మర్ల పేరిట అనేక మందిని హతమార్చారు. పోలీస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు.

తెలుగు రాష్ట్రాల పరిధిలో 1993 జనవరి 27న గ్రేహౌండ్స్ వ్యవస్థాపకుడు, ఐపీఎస్ అధికారి కే.ఎస్. వ్యాస్ హత్య, అలాగే 1999 ఏప్రిల్ 13న మాజీ స్పీకర్ డి. శ్రీపాద రావు హత్య, 1999 సెప్టెంబరు 4న ఐపీఎస్ ఉమేశ్ చంద్ర హత్య, 2000 మార్చి 7న అప్పటి పంచాయతీ రాజ్, హోంశాఖ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి హత్య, 2001 డిసెంబర్ 29న కాంగ్రెస్ ఎమ్మెల్యే ధీరావత్ రాగ్యానాయక్ హత్య, అలాగే అక్టోబర్ 1, 2003న తిరుమల అలిపిరి వద్ద అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై దాడి ఘటన సంచలన రేపాయి.  పోలీసుల ప్రతిదాడుల క్రమంలో అనేక మంది నక్సలైట్ అగ్రనేతలు సైతం ఎన్ కౌంటర్లలో హతమయ్యారు.

శాంతి చర్చల విఫలంతో దాడులు ఉదృతం

పీపుల్స్ వార్ నక్సలైట్ల ఏరివేతకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో గ్రేహౌండ్స్ ఏర్పాటు చేయబడింది. ఆ తర్వాత జనవరి 2005లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనూహ్యంగా మావోయిస్టులతో శాంతి చర్చలు నిర్వహించగా..అవి కాస్తా విఫలమై మళ్లీ నక్సలైట్ ఉద్యమం ఉదృతమైంది. ఇదే క్రమంలో మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర రాష్ట్ర బలగాలు జాయింట్ ఆపరేషన్లతో ఒత్తిడి పెంచాయి. ఆగస్టు 2005లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మావోయిస్ట్ పార్టీ, ఇతర అనుబంధ సంస్థలను నిషేధించింది. 2009లో భారత ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతకు భారీ సైనిక దాడిని ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల నిర్మూలన కార్యకలాపాలను ఉదృతం చేసింది. 2026మార్చి 31లోగా మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంగా భారీ కేంద్ర రాష్ట్ర బలగాలతో పాటు సైనిక బలగాలతో కలిసి దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లను విజయవంతంగా కొనసాగించింది.

ఆపరేషన్ కగార్ తో మావోయిస్టు పార్టీ అంతం

ఓ వైపు లొంగుబాట్లను ప్రోత్సహించడం..మరోవైపు వేలాది మంది భద్రత బలగాలు, డ్రోన్లు, హెలికాప్టర్లు, శాటిలైట్ నెట్ వర్క్ తో అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్లతో మావోయిస్టులను వరుస ఎన్ కౌంటర్లలో తుడిచిపెట్టడంలో ఆపరేషన్ కగార్ విజయవంతమైంది. కగార్ ఆపరేషన్లతో మావోయిస్టులు నిలువ నీడ లేక చివరకు ఆయుధాలను, అడవులను వదిలి లొంగుబాటలోకి రావడం అనివార్యమైపోయింది. మావోయిస్టుల కంచుకోటలైన చత్తీస్ గఢ్ అబూజ్ మడ్, దండకారణ్యం, ఏవోబీ సహా సరిహద్దు రాష్ట్రాలలో మావోయిస్టు స్థావరాలన్నింటిని జల్లెడ పట్టేయడంతో అగ్రనేతలతో పాటు వందలాది మంది పార్టీ కేడర్ ఎన్ కౌంటర్లలో హతమవ్వడం..మిగిలిన వారు లొంగిపోవడంతో మావోయిస్టు ఉద్యమం పూర్తిగా బలహీనపడిపోయింది. ఫలితంగా భారత్ లో ఒకప్పుడు రెడ్ కారిడార్ పేరుతో 200జిల్లాలలో తమ కార్యకలాపాలు సాగించిన మావోయిస్టు పార్టీ నేడు ఉనికిలో సైతం లేకుండా పోయినట్లయ్యింది. తెలంగాణ ఇప్పుడు మధ్యప్రదేశ్ తర్వాతా మావోయిస్టు రహిత రాష్ట్రంగా నిలబడటం విశేషం.

Latest News