సీఎం రేవంత్‌రెడ్డిది బాహుబలి మోసం: చేవేళ్ల ప్రచార సభలో కేటీఆర్

బహుబలి సినిమా మాదిరిగా మొదటి పార్ట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డగోలు హామీలతో ప్రజలను మోసం చేశారని, పార్లమెంటు ఎన్నికల్లో రెండో పార్ట్‌గా మోసాల మాటలు చెబుతున్నాడని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్

  • Publish Date - April 23, 2024 / 05:09 PM IST

పార్టీ మారిన ఆ ఇద్దరికి బుద్ది చెప్పాలి
రాముడు అందరి వాడు

విధాత : బహుబలి సినిమా మాదిరిగా మొదటి పార్ట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డగోలు హామీలతో ప్రజలను మోసం చేశారని, పార్లమెంటు ఎన్నికల్లో రెండో పార్ట్‌గా మోసాల మాటలు చెబుతున్నాడని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మంగళవారం చేవెళ్ల పార్లమెంటు స్థానం బీఆరెస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీలతో ఒకసారి మోసపోయింది చాలాదా? ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడిది తప్పు అని, రెండో సారి మోసం పోతే నమ్మిన వాళ్లది తప్పు అని కేటీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ అభివృద్ధి చేసిన పదేళ్ల పాలన ఒకవైపు…100 రోజుల అబద్దాల పాలన ఒక వైపుగా ఉందని, అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ పార్టీని నిలదీయాలన్నారు.
రైతుల దగ్గరకు వెళ్లి రూ. 2 లక్షల హామీ నెరవేరిందా అడగాలని, రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, రైతుబీమా, కేసీఆర్ కిట్ ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ ఎంతో మంచి చేసిండన్నారు. చేవెళ్లలో బ్రహ్మండమైన అభివృద్ధి చేసుకున్నామని, వికారాబాద్ ను జిల్లా చేసుకున్నామని, 111 జీవోను కూడా ఎత్తివేసింది కేసీఆర్ మాత్రమే అన్నది గుర్తు చేసుకోవాలన్నారు. బలహీన వర్గాలను ఒక్కటి చేసిన బహుబలి కాసాని జ్ఞానేశ్వర్ చేవెళ్లలో తొలిసారి బీసీ అభ్యర్థిగా బరిలో ఉన్నారన్నారని, బీసీల ఐక్యత చాటి తమ ప్రతినిధిగా ఆయనను గెలిపించుకోవాలని కోరారు.

కాంగ్రెస్‌-బీజేపీలకు మెజార్టీ సీట్లు రావు
కాంగ్రెస్ పార్టీ దేశంలో 100 నుంచి 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని కేటీఆర్ అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేదెవరైనా మన వద్దకు రావాలంటే బీఆరెస్‌కు మంచి సీట్లు రావాలని చెప్పారు. బీఆరెస్‌కు 8 నుంచి 10 సీట్లు ఇస్తే మనం చెప్పినట్లే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వింటదన్నారు. మోదీకి..ఎన్డీఏ కూటమికి 400 కాదు..200 ల సీట్లు కూడా వచ్చేలా లేవన్నారు. బీజేపీ పదేళ్లలో ఏమీ చేశారో చెప్పి ఓటు అడుగుమంటే చెప్పేందుకు ఒక్కటి లేదన్నారు. మోడీ తెలంగాణకు ఒక్క కాలేజ్ పెట్టినవా, స్కూల్ ఇచ్చినవా, జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చినవా? ఏమీ ఇచ్చినవని ఓటెయాలో ఆలోచించాలన్నారు. రాముడితోని మనకు పంచాయితీ లేదని, రాముడు అందరివాడని, మతం పేరుతో విద్వేషాలు నింపి ఎంపీ సీట్లు గెలవాలని భావిస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని కోరారు. జై శ్రీరామ్ అంటే మొక్కుదామని, తెలంగాణకు పైస పనిచేయని బీజేపీని తొక్కుదామని చెప్పారు. ఆడబిడ్డలు ఆలోచించాలని, మోదీ సిలిండర్ ధరను ఎంత పెంచిండో గుర్తు చేసుకోవాలని, క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పటికీ పెట్రోల్, డిజీల్ ధరలు పెంచినందుకు నిత్యావసర సరుకుల ధరలు పెంచినందుకు ఎందుకు బీజేపీకి ఓటెయాలని ప్రశ్నించారు. బండి సంజయ్ మాత్రం మోదీ దేవుడు అంటాడని, ఆయన దేనికి దేవుడో చెప్పుమంటే చెప్పడన్నారు. రాజకీయాల కోసం మతాన్ని వాడుకునే బీజేపీకి కచ్చితంగా మన బుద్ధి చెప్పాలన్నారు. ఈ ప్రాంతానికి బీజేపీ ఏం చేసిందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓటు అడుగుతున్నాడని కేటీఆర్ ప్రశ్నించారు. కృష్ణానీళ్లలో వాటా తేల్చుమంటే పదేళ్లుగా దాన్ని బీజేపీ తేల్చలేదన్నారు. పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వమంటే ఇవ్వని పార్టీ అంటే బీజేపీయే అని, బీజేపీని అడ్డుకునేది ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమే అని స్పష్టం చేశారు. ఈటల, రఘునందన్ రావు, అర్వింద్, సోయం బాపురావును ఓడించింది బీఆరెస్ మాత్రమేనన్నారు.

Latest News