Site icon vidhaatha

MP Etela Rajender | బీజేపీలో బీఆరెస్ విలీనం ఊహాజనితం.. రుణమాఫీ బోగస్: ఎంపీ ఈటల

హైడ్రా పేరుతో హైడ్రామా ఆపాలి
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్

విధాత, హైదరాబాద్ : బీజేపీలో బీఆరెస్ విలీనమంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఊహాజనితం, అవాస్తవమని, అది జరగని పని అని, ఇది కాంగ్రెస్ విష ప్రచారమని, బీజేపీలో అలాంటి చర్చల ప్రస్తావన లేదని మాజీ మంత్రి, మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఖండించారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి అసత్యపు ప్రచారాలు చేయడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీపై కూడా బోగస్ ప్రచారం చేసు్దని, రైతుల రుణమాఫీని ఎగవేసే ప్రయత్నం చేస్తుంది ఈటల ఆరోపించారు.

బ్యాంకర్ల లెక్కల ప్రకారం 72 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సిఉండగా.. ఎన్నికల ముందు రేవంత్ 63 వేల కోట్లు అని హామీఇచ్చారని, విధివిధానాల పేరుతో 34 వేల కోట్లకు కుదించారని, ఇప్పుడు 22 లక్షల మంది రైతులకు 17 వేల కోట్ల రుణమాఫీ చేసి పూర్తి చేశామని చెప్పుకుంటున్నారని గుర్తు చేశారు. ఒక్క ఘట్కేసర్ సోసైటీలోనే 1200 మంది రైతులకు 9 కోట్ల రుణాలలో ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదన్నారు. వందలకోట్లు ప్రజాధనంతో కేసీఆర్ లెక్కనే ప్రచారాలు చేసుకుంటున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు.

హైడ్రా పేరుతో జరుగుతున్న హైడ్రామాను ప్రభుత్వం ఆపాలని ఈటల డిమాండ్ చేశారు. ఎఫ్.టి.ఎల్ లో ఉన్న పట్టభూముల్లో నిర్మాణాలు కూల్చవద్దని, నీళ్ళు రాకుండా ఏర్పాటు చేయాలని, చిత్తశుద్ధి ఉంటే నిర్మాణాలు జరగకుండా చూడాలన్నారు. అక్రమకట్టడాల పట్ల కఠినంగా ఉన్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకుంటున్నారని, నువ్వేం చేస్తున్నావో అన్నీ మా దగ్గర చిట్టా ఉందని, పిల్లి కళ్ళు మూసుకొని పాలుతాగినట్టు చేస్తున్నారని, నువ్వేం సుద్ధపూస అనుకోకని, డ్రామాలు ఆపితే మంచిదన్నారు.

గొప్పగా పాలకుడు సర్దార్ పాపన్న

సాహస యోధుడిగా, గొప్పగా పాలకుడిగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చరిత్రలో నిలిచారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. చిక్కడపల్లిలో
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. మహనీయుల జయంతి, వర్ధంతి జరుపుకోవడం అంటే వారి ఆశయసాధనకు పాటుపడటమేనని, ఆ విగ్రహం చూడగానే మన కర్తవ్యం గుర్తుకురావాలని, బీసీలు ఐక్యత కోసం సమావేశాలకే పరిమితం కాకుండా లక్ష్యాల సాధనకు కృషి చేయాలన్నారు. మన జాతుల్ని సంఘటితం చేయడంలో సంఘాలు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. మన రాత మనం రాసుకోవాలని, గమ్యం నిర్దేశించుకొని ముందుకు పోవాలని సూచించారు. నేను అందరి పొత్తుల సద్దిలా ఉంటానని, రాజ్యాంగం ప్రసాదించిన సమాన హక్కుల కోసం పోరాడుతానన్నారు.

Exit mobile version