Site icon vidhaatha

అమన గల్లులో మార్వాడీ వ్యతిరేక ఉద్యమం..18న బంద్ !

విధాత : తెలంగాణలో ఇటీవల చెలరేగిన మార్వాడీ వ్యతిరేక ఉద్యమం వివాదస్పదమవుతోంది. తెలంగాణ అస్తిత్వ..ఆత్మగౌరవం పేరుతో మార్వాడీ వ్యతిరేక ఉద్యమం సాగిస్తున్న తీరు ఆందోళనకరంగా మారింది. మార్వాడీ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు లో ఈ నెల 18న మార్వాడీ వ్యాపారస్తుల గో బ్యాక్ అంటూ పట్టణ బంద్ తలపెట్టడం చర్చనీయాంశమైంది. మన ప్రాంతం-మన వ్యాపారం నినాదంతో మన వ్యాపార సంస్థలు, సంఘాలు, హోటల్స్ అంతా కూడా సోమవారం నిర్వహించే బంద్ ను విజయవంతం చేయాలని ఆమన గల్లు కిరాణ, వస్త్ర, వర్తక, స్వర్ణకార సంఘాల పేరుతో బంద్ కు పిలుపునిచ్చారు. ఏకంగా కరపత్రం సైతం విడుదల చేశారు.

మన పరిసర ప్రాంతాల్లో మార్వాడీలు దినదినాభివృద్ధి చెందుతూ అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ నాణ్యత లేని నాసిరకం వస్తువులు అమ్ముతూ మన ప్రాంత వ్యాపారస్తుల వ్యాపారం పరోక్షంగా క్షిణించడానికి కారణమవుతున్నారని వారు ఆరోపించారు. వారి దుకాణాల్లో వాళ్ల మనుషులనే లేబర్ గా పెట్టుకుంటూ స్థానిక యువతకు ఉపాధి లేకుండా చేస్తున్నారని..సఖ్యతతో మన ప్రాంతాల్లో పాగావేసి పాతుకునిపోయారని..ఇది ఇలాగే కొనసాగితే మన మనుగడకు ముప్పువాటిల్లుతుంది..ఇకపై మార్వాడీలు మన ప్రాంతాలలో అడుగుపెట్టకుండా కాపాడుకుందామని..ఇందుకు మన ప్రాంతం మన వ్యాపారం నినాదంతో అమన్ గల్లు పట్టణ బంద్ ను జయప్రదం చేయాలని కరపత్రంలో కోరారు.

మార్వాడీ గో బ్యాక్ పై బండి సంజయ్ ఫైర్

తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ ప్రచారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలో భాగంగా ఈ ప్రచారం తెరమీదకు తెస్తున్నారని అభ్యంతరం వ్యక్తంచేశారు. కమ్యునిస్టులు ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం చేస్తున్న డ్రామాలివంటూ ఫైర్ అయ్యారు. మీరు మర్యాడీ గో బ్యాక్ ఉద్యమాలు చేస్తే… తాము హిందూ కుల వృత్తులను కాపాడుకునే ఉద్యమం చేస్తామన్నారు.మార్వాడీలు హిందూ మతానికి అనుకూలంగా ఉంటున్నారనే కారణంతో.. ఒక పద్దతి ప్రకారం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అన్ని రాష్ట్రాల్లో మార్వాడీలు ఉన్నారు, అక్కడ గో బ్యాక్ అంటున్నారా? అంటూ నిలదీశారు. మార్వాడీల కారణంగా తెలంగాణ జీడీపీ పెరుగుతోందన్నారు. మర్వాడీలు ఏనాడూ తెలంగాణాలో రాజ్యాధికారం కోసం పాకులాడలేదు. తెలంగాణను దోచుకోలేదు. వ్యాపారాలు చేసుకుంటూ సంపదను సృష్టించారు. కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు. ఇలాంటి ప్రచారాలను తెలంగాణ ప్రజలు స్వాగతించబోరని బండి సంజయ్ స్పష్టం చేశారు. మీరు మార్వాడీలు గో బ్యాక్ అంటే మేం రోహింగ్యాలు గో బ్యాక్ ఆందోళనలు చేస్తామన్నారు.

మార్వాడీలను వెళ్లగొట్టే హక్కు ఎవరికి లేదు : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ ఉద్యమంపై టీపీసీసీ చీఫ్ బీ.మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగమైన మార్వాడీలు మనలో ఒకరు.. వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ రకమైన ప్రాంతీయ విద్వేషాలు రగిల్చి శాంతిభద్రతలను దెబ్బతీసి..రాష్ట్రా అభివృద్ధికి విఘాతం కల్గించే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ స్వాగతించేది లేదన్నారు.

Exit mobile version