ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులను శిక్షిస్తాం: మంత్రి పొంగులేటి

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరుగుతుందని, పూర్తి ఆధారాలను ప్రజల ముందుంచి తప్పు చేసిన ప్రతి వారిని ఏడు చెరువుల నీళ్లు తాగించి చట్టపరంగా శిక్షించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని

  • Publish Date - April 14, 2024 / 08:09 PM IST

మాజీ సీఎం పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడి
భూకబ్ధాదారులను వదలం

విధాత : ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరుగుతుందని, పూర్తి ఆధారాలను ప్రజల ముందుంచి తప్పు చేసిన ప్రతి వారిని ఏడు చెరువుల నీళ్లు తాగించి చట్టపరంగా శిక్షించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆరెస్ పాలనలో వర్షాకాలంలో కరవు ఏర్పడితే డిసెంబర్ 9న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలోనే కరవు వచ్చిందంటూ బీఆరెస్ నేతలు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం సహా సాగునీటి ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. వేసవి కాలంలో నీటి సమస్యను తెరమీదకు తెచ్చి.. ప్రజల వద్దకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అయితే.. ఇప్పుడు బీఆరెస్ నేతల మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మిషన్ భగీరథకు 46 వేలకోట్లు ఖర్చు పెట్టి, ప్రతి గ్రామానికి మినరల్ వాటర్ ఇస్తానని గొప్పలు చెప్పిన మాజీ సీఎం కేసీఆర్ 60శాతం గ్రామాలకు తాగునీరివ్వలేని దుస్థితి తెచ్చారన్నారు.

తమ ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం ప్రతి గ్రామానికి మంచినీటి ఇచ్చే పనులు చేపడుతుందన్నారు. గత ప్రభుత్వంలో అధికారం చేపట్టిన మంత్రులు సైతం భూ కబ్జాలకు పాల్పడ్డారని, వారికి తగిన శాస్తి చేసి చూపిస్తామని హెచ్చరించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని నమ్మకం వెలిబుచ్చారు. గత బీఆరెస్‌ ప్రభుత్వంతెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందని తమ ప్రభుత్వం ఆర్ధికంగా ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ ఆరు గ్యారంటీలలో ఐదింటిని అమలు చేసిందని, మిగతా హామీలను ఎన్నికల అనంతరం ఒక్కోటి అమలు చేస్తామన్నారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చరమగీతం పాడాలని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు కష్టపడాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులాలను, మతాలను రెచ్చగొట్టి.. రామ మందిరం పేరుతో రెండుసార్లు అధికారం చేపట్టిందని మండిపడ్డారు. అలాంటి బీజేపీని గద్దె దించాల్సిందేనన్నారు. ఈ సమావేశంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

Latest News