హైదరాబాద్, సెప్టెంబర్ 17(విధాత): మంగళవారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో ములుగు కలెక్టర్ సంగతి చూస్తామని నరసింహమూర్తి అనే బీఆర్ఎస్ నాయకుడు చేసిన కామెంట్స్ పై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. 900 మంది రైతులకు నష్టపరిహారం అందించినందుకు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ ను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని అంటారా అని ప్రశ్నించారు.
కేటీఆర్ రైతు పక్షపాతా, లేక దళారులు, నకిలి విత్తన వ్యాపారుల పక్షపతా అని నిలదీశారు. కేటీఆర్ రైతుల చావుకు కారణమైన నకిలీ విత్తన కంపెనీల పక్షమా? లేక కర్షకుల పక్షమా అని ధ్వజమెత్తారు.
నకిలీ విత్తనాలు రైతులకు కట్టబెట్టి రైతు ల చావుకు కారణమైన దళారుల నుండి రైతులకు నష్టపరిహారం అందివ్వడం ములుగు జిల్లా కలెక్టర్ చేసిన తప్పా అని మంత్రి సీతక్క మండిపడ్డారు.
పనిచేసే కలెక్టర్‌ను కేటీఆర్ సమక్షంలోనే అవమానించినట్టు మాట్లాడుతుంటే కేటీఆర్ స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. నరసింహమూర్తి తన యావదాస్తి అమ్మి అయినా సరే కలెక్టర్ ను రాష్ట్రంలో లేకుండా చేస్తా అనడం సభబేనా, కేటీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సీతక్క వెల్లడించారు.