హైదరాబాద్, సెప్టెంబర్ 29(విధాత): జర్నలిస్టుల కుటుంబాలకు మీడియా అకాడమీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాంపల్లిలోని మీడియా అకాడమీ భవనంలో జర్నలిజం వృత్తిలో అమరులైన 18 మంది జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు రూ. లక్ష చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి జర్నలిస్టులు విశేషంగా కృషి చేశారన్నారు. కొన్ని యాజమాన్యాలు వ్యతిరేకించినా జర్నలిస్టు లు వెనక్కి తగ్గలేదని తెలిపారు.
ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టులు పనిచేస్తారు, ప్రభుత్వ దృష్టికి సమస్యలు తీసుకొచ్చి వాటిని పరిష్కరింప చేయడంలో జర్నలిస్ట్ ల పాత్ర గొప్పదని కొనియాడారు.
మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుంది, డ్యూటీలో భాగంగా మరణించిన జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం బాధ్యతగా స్వీకరిస్తుందని స్పష్టం చేశారు. జర్నలిస్టులకు శిక్షణ తో పాటు చికిత్స, దురదృష్టవశాత్తు మరణిస్తే ఆర్థిక చేయుత అందిస్తున్నామని అన్నారు.
జర్నలిస్టు కుటుంబం ఒంటరి కాదు అని చెప్పడానికి ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటున్నామని, ఒకరి కోసం అందరూ.. అందరి కోసం ఒకరు అన్నట్లుగా జర్నలిస్టులంతా ఒకరికొకరు తోడుగా ఉండాలన్నారు.జర్నలిస్టులంతా వాస్తవాలకు అద్దం పడుతూ వార్తలు అందించాలని సూచించారు. విశ్వసనీయత పెరిగేలా సమాచారం అందించాలి, నిజమైన వార్త వ్యక్తిగత ప్రయోజనాలను కాకుండా ఎల్లప్పుడు సామాజిక ప్రయోజనాన్ని కోరుకుంటుందన్నారు. ఆ విధానాన్ని అంతా నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నానన్నారు.
ఇల్లు లేని జర్నలిస్టులకు ఇంటి సదుపాయం కల్పించాలని జర్నలిస్టులు కోరుతున్నారు, సీఎం దృష్టికి తీసుకెళ్లి జర్నలిస్టులకు ఇండ్లను కేటాయిస్తామన్నారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు హెల్త్ కార్డులు మంజూరు చేస్తాం, మరణించిన జర్నలిస్టు కుటుంబంతో ఇదే అనుబంధాన్ని కొనసాగిస్తామని, తోడుగా, తోబుట్టువుగా అండగా ఉంటామన్నారు.