పేదల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి దుద్దిళ్ల

పేదల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్‌ మండలంలోని మల్లాపూర్‌లో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రేషన్ కార్డుల ద్వారా ప్రతి కుంటుంబానికి నెలకు సగటున రూ. 1200 విలువైన ఉచిత బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు

విధాత, హైదరాబాద్: పేదల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్‌ మండలంలోని మల్లాపూర్‌లో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రేషన్ కార్డుల ద్వారా ప్రతి కుంటుంబానికి నెలకు సగటున రూ. 1200 విలువైన ఉచిత బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు. అర్హులైన పేదలకు రేషన్ కార్డులు జారీ చేయాలనే లక్ష్యంతో రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో 12 వేల కొత్త రేషన్ కార్డుల జారీతో సగటున 50 వేల మందికి సన్నరకం బియ్యం అందిస్తున్నట్లు వెల్లడించారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నీటిని తీసుకొచ్చి హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య లేకుండా చేసిందన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి నీటిని తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు. ఈ ప్రాంతానికి కొత్త పరిశ్రమలను తీసుకువస్తున్నామని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ఆయన అన్నారు. ఇప్పటివరకు 65 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రసాభస
ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ విషయంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు. సబితా ఇంద్రారెడ్డిన అవమానించారని, ప్రోటోకాల్ పాటించకుండా.. ఓడిపోయిన నాయకుడు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిని వేదికపై కూర్చోబెట్టారని మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.