కేజ్రీవాల్‌.. కవితలకు మళ్లీ 14రోజుల కస్టడీ

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత జ్యూడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరో 14రోజులు పొడగించింది. ఈడీ కేసులో ఆమె కస్టడీ ముగిసిపోవడంతో మంగళవారం ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో

  • Publish Date - April 23, 2024 / 03:37 PM IST

మే 7వరకు పొడిగింపు
బెయిల్ పిటిషన్ విచారణ నేటికి వాయిదా

విధాత : ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌, బీఆరెస్ ఎమ్మెల్సీ కవితల జ్యూడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరో 14రోజులు పొడగించింది. ఈడీ కేసులో వారిద్ధరి కస్టడీ ముగిసిపోవడంతో మంగళవారం వారిని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. వారికి జ్యూడిషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు వారిని తిరిగి మే 7వ తేదీన కోర్టులో హాజరుపరుచాలని ఆదేశించింది. దీంతో వారిద్దరిని తిరిగి తిహార్ జైలుకు తరలించారు. 60రోజుల్లో కవిత అరెస్టుపై చార్జ్‌షీట్ సమర్పిస్తామని కోర్టుకు ఈడీ తెలిపింది. కేసు దర్యాప్తు పురోగతి కాపీని ఈడీ కోర్టుకు అందించింది.

బెయిల్ పిటిషన్ విచారణ నేటికి వాయిదా
కవిత బెయిల్ పిటిషన్‌పై మంగళవారం వాదనలు విన్న కోర్టు విచారణను బుధవారంకు వాయిదావేసింది. కవిత తరపున న్యాయవాది నితేష్ రానా వాదనలు వినిపించగా… ఈడీ తరపున లాయర్ జోయబ్ హుస్సేన్ వినిపించారు. ఈడీ వాదనల అనంతరం ఈ కేసుపై విచారణను కోర్టు రేపటికి (బుధవారం) వాయిదా వేసింది. రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి. రేపు మధ్యాహ్నం ఇరువురి వాదనలు రౌస్ అవెన్యూ కోర్టు విననుంది. ఈడీ తరపున సుదీర్ఘ వాదనలున్నాయని కోర్టుకు ఈడీ న్యాయవాది జోయబ్ హుస్సేన్ తెలిపారు. ఈడీ వాదనల అనంతరం కవిత తరపు న్యాయవాదులు కౌంటర్ వాదనలు వినిపించనున్నారు. మంగళవారం ఈడీ తరఫున జోయబ్ హుస్సేన్ కవితకు బెయిల్ ఇవ్వొద్దని వాదించారు. కవిత అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని, సెక్షన్ 19కి అనుగుణంగా జరిగినట్లు ఈడీ వివరించారు. కవితను అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదని, 2023 సెప్టెంబర్ 26న ఈడీ తదుపరి 10 రోజులు సమన్లు ఇవ్వబోమని అండర్ టేకింగ్ ఇచ్చిందని, మార్చి 15న సాయంత్రం 5.20 గంటలకు ఆమెను అరెస్టు చేశామని తెలిపారు. తనపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారని, సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను మార్చి 15న ఆమె ఉపసంహరించుకున్నారని, కవితకు వ్యతిరేకంగా శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ వాంగ్మూలాలు ఇచ్చారని నివేదించారు. కవితను సూర్యాస్తమయం లోపే అదుపులోకి తీసుకున్నామని, కవిత ఆరెస్టు సాయంత్రం 5.20 గంటలకు జరిగిందని పేర్కోన్నారు. కవిత అరెస్టు రోజు హైదరాబాద్‌లో సూర్యాస్తమయం సాయంత్రం 6.28గంటలకు అయ్యిందని తెలిపారు. ఇండోస్పిరిట్స్ కంపెనీలో కవిత బినామీగా అరుణ్ పిళ్లై ఉన్నారని, అరెస్టుకు గల కారణాలు చెప్పి కవిత సంతకం తీసుకున్నామని, అరెస్టు చేసిన 24గంటల్లో కోర్టులో హాజరుపరిచామని, సౌత్ గ్రూప్‌లోని ఇతర వ్యక్తులకు ప్రేమ్ మండూరి బినామీగా ఉన్నారని ఈడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై సుదీర్ఘ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో తదుపరి విచారణను కోర్టు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. ఈడీ వాదనలు పూర్తయిన తర్వాత కవిత తరపు న్యాయవాదులు కౌంటర్ వాదనలు వినిపించనున్నారు.
కాగా సీబీఐ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై మే 2 వ తేదీన ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భవేజా ధర్మాసనం తీర్పు వెల్లడించనుంది.

Latest News