Site icon vidhaatha

అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తున్న మోడీ ప్రభుత్వం … న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం. శ్రీనివాస్

విధాత, వరంగల్ ప్రతినిధి:గత పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ ప్రజాస్వామ్య ప్రేమికునిగా ఫోజులు కొడుతున్నదని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం. శ్రీనివాస్ విమర్శించారు.

వరంగల్ లో బుధవారం జరిగిన కార్యకర్తల జనరల్ బాడీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు రాచర్ల బాలరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ 49 సంవత్సరాల క్రితం నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి దేశంలో ఎమర్జెన్సీ పెడితే మోడీ ప్రభుత్వం నేడు హిందుత్వ బ్రాహ్మణీయ ఫాసిజాన్ని అమలు చేస్తూ భారత రాజ్యాంగం స్థానంలో మనువాద రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసేందుకు పూనుకున్నదని ఆయన విమర్శించారు.

18 విడత పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి 400 సీట్ల మెజారిటీతో అధికారంలోకి రావడానికి చేసిన దుష్ట ప్రయత్నాన్ని దేశ ప్రజలు తిప్పి కొట్టారని ఆయన అన్నారు. రాజ్యాంగపరంగా ఏర్పాటైన సంస్థలన్నీటిని తమ ప్రభుత్వ జేబు సంస్థలుగా మార్చుకున్నదని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల మేధావుల ప్రజాస్వామిక వాదులపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిందని ఆయన విమర్శించారు. రాష్ట్రాల హక్కులు కాలరాస్తూ సమాఖ్య వ్యవస్థను రద్దు చేయడానికి చేసిన ఎత్తులను ప్రజలు గమనించారని ఆయన అన్నారు. రాబోవు రోజుల్లో ప్రజల ప్రజాస్వామ్య హక్కులను, జాతుల స్వయం నిర్ణయాధికార హక్కులను కాపాడుకొనుటకు జరిగే పోరాటాలలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు బండి కోటేశ్వరరావు, గంగుల దయాకర్, పి వై ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలకంటి రాజేందర్ లు ప్రసంగించారు. ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు జక్కుల తిరుపతి, గట్టి కృష్ణ, పి వై ఎల్ జిల్లా నాయకులు గండ్రతి హరిబాబు, ఇనుముల కృష్ణ , రంజిత్, అక్బర్, అమర్ తదితరులు పాల్గొన్నారు.

 

Exit mobile version