Heartbreaking incident | సహనానికి మారుపేరుగా చెప్పుకునే మహిళలు..సంతనాన్ని కంటికి రెప్పలా కాచుకునే తల్లులు ఇటీవల కాలయములుగా మారిపోతున్నారు. దారితప్పి కొందరు.. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటి కారణాలతో మరికొందరు తమ సంతానాన్ని తామే బలితీసుకుంటున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
తాజాగా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో ఓ తల్లి తన నాలుగేళ్ల కూతురికి విషమిచ్చి తానూ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. క్రిష్ణపావని అనే మహిళ తన కూతురు జశ్విక(4)కు కూల్ డ్రింక్ లో ఎలుకల మందు కలిపి తాగించింది. అనంతరం తాను కూడా ఆ విషం తాగింది.
ఆసుపత్రి చికిత్స పొందుతూ ఆదివారం చిన్నారి జశ్విక ప్రాణాలు విడిచింది. క్రిష్ణపావని పరిస్థితి కూడా విషమంగా ఉంది. క్రిష్ణపావని ఆరోగ్య సమస్యల కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం.