విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆరెస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు ఓటమి భయంతో అబద్దాలు మాట్లాడుతున్నారని పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. నేను గాని, కాంగ్రెస్ నేతలుగాని రైతుబంధు ఆపాలని ఎక్కడా చెప్పలేదని, తాము అలా చెప్పినట్లుగానే వారు దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. గత నెలలో రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు, రుణమాఫీల లబ్ధిని నామినేషన్ ప్రక్రియ కంటే ముందే లబ్ధిదారులకు విడుదల చేయాలని డిమాండ్ చేశామన్నారు.
కాంగ్రెస్ రైతు బంధు ఆపాలనడం లేదని, పెంచాలని చెబుతున్నామన్నారు. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేయాలని మా మేనిఫెస్టోలో పెట్టామన్నారు. ఏక కాలంలో రుణమాఫీ చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ దేశంలోనే మొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చింది కాంగ్రెస్ మాత్రమేనన్నారు. తెలంగాణలో రైతంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని, ఇప్పుడు బీఆరెస్ 24 గంటలు ఇవ్వడం లేదన్నారు. మోడీ, కేసీఆర్‌లు రైతులకు అన్యాయం చేశారని, రైతుల ఆదాయం మోడీ డబుల్ చేస్తామని చేయలేదన్నారు. పంట నష్టం జరిగితే పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు.
వరికి 500 బోనస్ కాంగ్రెస్ ఇవ్వనుందని, ఇప్పటికే ఛత్తిస్ ఘడ్ లో అమలు చేస్తున్నామన్నారు. కేసీఆర్ లక్ష కోట్ల అప్పు తెచ్చి కాళేశ్వరం కడితే ఒక ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వక ముందే కూలిపోతున్నాయన్నారు. కాళేశ్వరంలో అవినీతి వల్లే నాణ్యత లోపం ఉందని, దీనిపై కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తరువాతే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. రైతు బంధు కంటే రైతు భరోసా తీసుకొచ్చి 15 వేలు ఇస్తామన్నారు. లక్ష రూపాయల రుణమాఫీ మీద కేసీఆర్ ఎందుకు మోసం చేశారో రైతులు ఆలోచించాలన్నారు.
తెలంగాణలో రాబోయేది ప్రజాప్రభుత్వమని, ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం తెస్తుందన్నారు. డిసెంబర్ 9న డెఫినెట్‌గా క్లీన్ షేవ్‌తో కనిపిస్తానన్నారు. తమ మేనిఫెస్టో అద్భుతంగా ఉందన్నారు. కానీ 420 లకి అన్ని 420 లాగే కనిపిస్తాయని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు మెంటల్‌తో రబ్బిష్ మాట్లాడుతున్నారన్నారు. కర్ణాటక వెళ్లి వచ్చానని.. అక్కడి గ్యారెంటీ స్కీములు అమలవుతున్నాయన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశానికి కట్టుబడి ఉంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ సమాజం కాంగ్రెస్ వైపు చూస్తుందన్నారు. విజయశాంతి వంటి సీనియర నేత, ఉద్యమకారులు కాంగ్రెస్‌లోకి రావాడం హర్షనీయమన్నారు.
బీజేపీ బీఆరెస్ రెండు ఒక్కటే: విజయశాంతి
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ, బీఆరెస్ రెండు ఒక్కటిగానే పనిచేస్తున్నాయని, ఆ రెండు పార్టీలను ప్రజలను ఓడించి బుద్ధి చెప్పాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ప్రచార ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డీనేటర్ విజయశాంతి కోరారు. తాను తిరిగి కాంగ్రెస్‌లో చేరి పాత మిత్రులతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం సీఎం కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటుందన్న నమ్మకంతోనే తాను ఆనాడు కాంగ్రెస్‌ను విడిచి బీజేపీలో చేరడం జరిగిందన్నారు.
కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని బీజేపీలోని తెలంగాణ ఉద్యమకారులకు మాట ఇచ్చిందని, అందుకు విరుద్ధంగా నెలలు సంవత్సరాలు గడిచిన కేసీఆర్ పై మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. బీఆరెస్‌తో కలిసి పనిచేస్తున్నందునే తాము తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చామన్నారు. 25సంవత్సరాలుగా రాష్ట్రమే ముఖ్యమన్న లక్ష్యంతో ప్రజల్లో, పార్లమెంటులో పోరాటం చేశానన్నారు. మోడీ, అమిత్ షా, నడ్డాలను అడుగుతున్నానని, మీరు ఎప్పుడు తెలంగాణకు వచ్చిన కేసీఆర్ అవినీతిపరుడు, కుటుంబ పాలన అని విమర్శించారని, కాళ్వేవరం కేసీఆర్‌కు ఏటీఎం, ఆయన దొంగ అని చెబుతారని, కాని కేసీఆర్ అవినీతిపై చర్యలు మాత్రం ఎందుకు తీసుకోరంటూ ప్రశ్నిస్తున్నానన్నారు.
మెడిగడ్డ పిల్లర్లు కుంగిన ఎందుకు చర్యలు తీసుకోలేదని, బీఆరెస్‌తో ఒప్పందం ప్రకారమే చర్యలు తీసుకోవడం లేదా అని ఆమె నిలదీశారు. కేసీఆర్ అవినీతిపై ఆధారాలన్నిమోడీ వద్ధ ఉన్నాయని, కేంద్రంలో తగిన మెజార్టీ కూడా ఉందని అయినా కేసీఆర్ అవినీతిపై చరర్యలు తీసుకోకపోవడంతో బీజేపీ బీఆరెస్ రెండు ఒక్కటేనని తేలిపోయిందన్నారు. బీజేపీ నేతలు తెర ముందు ఒకలా..తెర వెనుకాల మరొకలా మాట్లాడుతున్నారని వాటి మాటలు నమ్మి ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, ఉద్యమకారులు పిచ్చోళ్ళు అయ్యారన్నారు.
బండి సంజయ్ అధ్యక్షుడిగా మార్చడంతో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందన్నారు. సంజయ్ మార్పును ఉద్యమకారులు వ్యతిరేకించినా మొండిగా బీఆరెస్ ప్రయోజనాల కోసం మార్చారని విజయశాంతి ఆరోపించారు. బీజేపీలో ఒక నాయకుడిని మొక్క నాటినట్టు నాటారని, ఆయన చెప్పడంతో అధ్యక్షుడిని మార్చేసి చేజేతులా ఆ పార్టీని వారే నాశనం చేసుకున్నారన్నారు. బీజేపీలోని సదరు నేత అసైన్డ్ భూముల కేసు ఏమైందో చెప్పాలన్నారు.
నన్ను తిట్టే హక్కు బీజేపీ, బీఆరెఎస్‌లకు లేదని, నేను డబ్బు కోసం, పదవుల కోసం లొంగే వ్యక్తిని కాదన్నారు. మా గురువు అద్వానీ విలువలతో కూడిన రాజకీయాలు చెప్పారని, కాని ఇప్పటి బీజేపీ నేతలకు అలాంటి విలువలు లేవన్నారు. తెలంగాణలో ఎన్నికల్లో ప్రజలు పేదల సంక్షేమం కోసం, కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలన అంతం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆమె కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా కేసీఆర్ అవినీతిని కక్కిస్తుందన్నారు.