విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్లలో శనివారం నుంచి నూతన విధానం అమలులోకి వచ్చింది. కొత్త విధానంతో వాహన కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ కోసం రవాణాశాఖ కార్యాలయం చుట్టూ తిరుగాల్సిన వ్యయప్రయాసలు ఇకపై తప్పనున్నాయి. వాహన కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా రవాణా శాఖ కొత్త విధానం తీసుకొచ్చింది.
వాహన కొనుగోలు చేసిన షో రూమ్ లలోనే వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. వాహనం విక్రయించిన డీలరే శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తారు. రవాణాశాఖ అధికారులు ఆన్‌లైన్‌లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఉదయం కొనుగోలు చేసిన వాహనానికి సాయంత్రంలోగా శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తయిపోతుంది. సాయంత్రం కొనుగోలు చేస్తే మాత్రం మరుసటి రోజు ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు.
నూతన విధానం ప్రయోగం సక్సెస్
షో రూమ్ లోనే వాహనాల కొనుగోలు రిజిస్ట్రేషన్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జనవరి 8న విధానపరమైన నిర్ణయం తీసుకుంది. దీని అమలు కోసం అధికారులు సంబంధిత సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని శ్రీకృష్ణ ఆటోమోటివ్స్ షోరూమ్‌లో నూతన ఆన్‌లైన్ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టారు. షోరూమ్‌లో ఫోర్ వీలర్ కొనుగోలు చేసిన వాహనదారుడికి సంయుక్త రవాణా కమిషనర్(జేటీసీ) మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ రిజిస్ట్రేషన్ పూర్తిచేసి పత్రాల్ని అందించారు. నూతన విధానం అమలు ప్రక్రియపై రవాణాశాఖ కమిషనర్ 33 జిల్లాల అధికారులతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. శనివారం నుంచి నూతన విధానం అమలులోకి వస్తుంది.వాహనాల నూతన రిజిస్ట్రేషన్ విధానంతో ప్రజలకు మరింత అందుబాటులో రవాణా సేవలు రానున్నాయని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
కొత్త విధానంలో రిజిస్ట్రేషన్ పక్రియ వివరాలు
వాహన రిజిస్ట్రేషన్ కు సంబంధించి అవసరమైన పత్రాలు(ఇన్వాయిస్, ఫారం-21, ఫారం-22, బీమా, అడ్రస్ ప్రూఫ్, వాహన ఫొటోలు మొదలైనవి) డీలర్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆ దరఖాస్తులను రవాణా శాఖ అధికారి పరిశీలించి రిజిస్ట్రేషన్ నంబరు కేటాయిస్తారు.
ఈ ప్రక్రియ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్‌సీ) నేరుగా స్పీడ్ పోస్టు ద్వారా వాహన యజమానికి వెళుతుంది.శాశ్వత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పరిశీలనకు అవసరమైతే డీలర్ల షోరూముల్లో రవాణాశాఖ అధికారులు తనిఖీలు జరుపుతారు. నూతన రిజిస్ట్రేషన్ విధానం ద్విచక్ర వాహనాలు, కార్లకు మాత్రమే వర్తిస్తుంది. వాణిజ్య(ట్రాన్స్‌పోర్ట్) వాహనాల రిజిస్ట్రేషన్ గతంలో మాదిరిగానే ఆర్టీఓ కార్యాలయాల్లోనే కొనసాగనుంది.
ఇవి కూడా చదవండి :
USA Crime News : అమెరికాలో భార్య సహా ముగ్గురి బంధువుల హత్య !
Therapist Attacks Woman : మసాజ్ సర్వీస్ రద్దు చేసుకున్నందుకు మహిళపై థెరపిస్ట్ దాడి.. షాకింగ్ వీడియో
