విధాత, హైదరాబాద్ : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంపైన చేసిన విమర్శలకు సోమవారం మంత్రులు వరుసబెట్టి ఎదురుదాడి చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనలో బీఆర్ఎస్ కండలన్నీ కరిగి తోలు మాత్రమే మిగిలిందని, ఆ ఉన్న తోలును కాపాడుకోవడానికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోలు తీస్తానని మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రతిష్ట దిగజారిందని కేసీఆర్‌కు అర్థమై పార్టీని కాపాడుకోవడానికే ఇన్ని రోజుల తర్వాత బయటికి వచ్చాడన్నారు. కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టను కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎందుకు పూర్తి చేయలేదని, ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేకపోయాడని నిలదీశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పాలనకు రెఫరెండమ్ అని కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగతి గుర్తులేదా అని ప్రశ్నించారు.
తోలు తీయించుకోవడానికి సిద్దంగా లేము: మంత్రి పొన్నం
కేసీఆర్ తోలు తీస్తామంటే తీయించుకోవడానికి సిద్ధంగా లేము అని మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో తోలు తీసే హక్కు ప్రజలకు మాత్రమే ఉందన్నారు. అసెంబ్లీ, ఎంపీ, ఎమ్మెల్సీ, ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలలో ఇప్పటికే ప్రజలు బీఆర్ఎస్ తోలు తీశారన్నారు. ఎవరు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని, బరాబర్ సమాధానం చెబుతామన్నారు. తోలు తీయాలనుకున్నా…ఇంకా ఏదైనా ఉన్నా.. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ మాట్లాడాలన్నారు. కేసీఆర్ పాలన వైఫల్యాల గూర్చి ఆయన కూతురు కవితనే నిత్యం చెబుతుందని..ముందు వాటిపై సమాధానం చెప్పాలని హితవు పలికారు.
కవితమ్మ తీస్తున్న తోలుకు పాచెస్ వేసుకోండి : మంత్రి వాకిటి శ్రీహరి
కేసీఆర్ మా తోలు తీయడం కాదు అని..ముందుగా కవితమ్మ తీస్తున్న తోలుకి ముందు పాచెస్ వేసుకోండని మంత్రి వాకిటి శ్రీహరి చురకలేశారు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా సేమ్ ఇవే డైలాగులు కొట్టిండని.. పాలమూరు మీద కేసీఆర్ కపట ప్రేమ చూపిస్తున్నారని, అధికారంలో పదేళ్లు మాత్రం ఒక్క ప్రాజెక్టు కట్టలేదని, ఒక్క ఎకరాకు నీరివ్వలేదని విమర్శించారు. అసలు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుని కట్టకుండానే, అనుమతులు లేకుండానే, పంప్ హౌజ్ లు, కాలువలు నిర్మించకుండానే జాతికి అంకితం చేశాం అని కేసీఆర్ ఎలా చెప్పగలుగుతున్నారు? అని ప్రాజెక్టు కట్టకుండానే అలాంటి మాటలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అందుకే కదా మొన్న ఎన్నికల్లో కేసీఆర్ కు కర్రు కాల్చి వాత పెట్టారు అని వాకిటి శ్రీహరి విమర్శించారు.
కేసీఆర్‌వి పస లేని మాటలు: ఆది శ్రీనివాస్
ప్రతిపక్ష నేతగా బాధ్యత విస్మరించి ఇన్నాళ్లు ఫామ్ హౌస్ లో పడుకుని..బయటకొచ్చిన కేసీఆర్ పదేళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెబుతారని అనుకున్నామని, రెండేళ్ల తర్వాత నిద్ర లేచి జనం బాట పడతాననడం హాస్యాస్పదంగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. అసెంబ్లీకి రావడానికే భయపడుతూ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల్లో అవుట్ డేటెడ్ అయ్యారన్నారు. తోలు తీస్తానని కేసీఆర్ చెప్పిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని, అసెంబ్లీ, ఎంపీ, ఎమ్మెల్సీ, ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలే ఆయన తోలు తీస్తే ఎండిపోయిందన్నారు. ప్రాజెక్టులపైన కేసీఆర్ చెప్పినవన్ని అబద్దాలేనని, ఆయన మాట్లాడిన ప్రతి మాటకు మా వద్ద సమాధానం ఉందన్నారు. తెలంగాణకు నది జలాల్లో నష్టం చేసిన కేసీఆర్..ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కేసీఆర్ పాలనలో 8లక్షల కోట్ల అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే..సీఎం రేవంత్ రెడ్డి వాటన్నింటిని సరిచేసుకుంటూ చక్కని పరిపాలన చేస్తున్నారు. భావి తరాల కోసం ఫ్యూచర్ సిటీ చేపడితే..రాష్ట్ర అభివృద్ది కోసం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తే వాటిని తప్పుబట్టిన కేసీఆర్ తీరు ఖండనీయమన్నారు. మీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు ఏమిటో మీ కూతురు కవిత నే చెబుతుందన్నారు. ఆమె మాట్లాడిన మాటలకు ముందు కేసీఆర్ సమాధానం చెప్పాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి :
India’s New Income Tax Bill : ఏప్రిల్ 1 నుంచి సోషల్ మీడియా, ఈ మెయిల్, డిజిటల్ ఖాతాల తనిఖీలు
Jeddah Tower : బూర్జు ఖలిఫా ను మించి జెడ్డా టవర్
