విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ‘పదేళ్లుగా బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రo సర్వనాశనమైంది. మళ్ళీ ఆపార్టీని గెలిపిస్తే పేదల బతుకులు ఆగం అవుతాయి. ఈఎన్నికల్లో కేసీఆర్ ను ఇంటికి పంపిస్తే అందరి జీవితాలు వెలుగులోకి వస్తాయి’ అని పాలమూరు బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి అన్నారు. శనివారం నియోజకవర్గం లోని హన్వాడ మండలంలో ప్రచారం సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
రాష్ట్రంలో రేషన్ కార్డు కొత్తది ఇవ్వడం లేదని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఆపార్టీ నాయకులకే ఇచ్చారని, పిల్లలు చదువుకొని ఉద్యోగం వస్తదని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తుల పేరుపై రూ.200 కోట్ల దండుకున్న కేసీఆర్ ను ఓటు అనే ఆయుధంతో దెబ్బకొట్టాలన్నారు. ఉద్యోగాల కోసం పరీక్షలు పెట్టి పేపర్ లీకేజీలు చేస్తున్నాడని, ఇక్కడున్న మంత్రి సమస్యలపై ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టి భయపెట్టిస్తున్నాడన్నారు. ఆయన మళ్లీ గెలిస్తే ఏకఛత్రాధిపతి అవుతాడని, పాలమూరు ప్రజలు సుఖంగా నిద్ర పోయే పరిస్థితి ఉండదని మిథున్ అన్నారు.
మరోసారి గెలిపిస్తే మీ ఇంట్లో ఆయన ఫొటో లేనిది రేషన్ కార్డు, పింఛన్ రాదని భయపెట్టిస్తారన్నారు. ఆదర్శ గ్రామంగా ప్రకటించి నరేంద్ర మోడీ రూ.కోటి కొనగట్టుపల్లికి ఇచ్ఛారన్నారని ఈసందర్భంగా గుర్తుచేశారు. విశ్వ గురువు ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిఒక్కరికి ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కల్పిస్తున్నారన్నారు. కరోనా మహమ్మారి నుంచి తల్లి చనిపోతే కొడుకు చూడని పరిస్థితి…కొడుకు చనిపోతే తల్లి చూడని పరిస్థితి ఉండేదని, అలాంటి పరిస్థితిలో ఉచితంగా టీకాలు వేసి మన ప్రాణాలు కాపాడిన మోడీకి ప్రజలు కృతజ్ఞతలు తెలపాలన్నారు.
అప్పటినుంచి ఇప్పటివరకు ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్నాడని, వచ్చే ఐదేళ్లపాటు పేదలందరికీ ఉచిత రేషన్ బియ్యం ఇచ్చేందుకు నరేంద్ర మోడీ ప్రకటన చేయడం జరిగిందన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీ ఎమ్మెల్యేను గెలిపిస్తే బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ప్రకటించారన్నారు. రెండుసార్లు ఎంపీగా ఈ జిల్లా ప్రజలకు సేవలందించిన ఏపీ జితేందర్ రెడ్డి కుమారుడిగా మీకు సేవ చేస్తానని మిథున్ రెడ్డి అన్నారు.