లిక్కర్ పాలసీపై హైకోర్టులో పిటిషన్
రూ.3లక్షల ఫీజు నిర్ణయంపై అభ్యంతరం
ఎక్సైజ్ శాఖ కమిషనర్ కు నోటీసులు జారీ
హైదరాబాద్, అక్టోబర్ 13 (విధాత ప్రతినిధి): తెలంగాణలో మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ధరఖాస్తు ఫారానికి రూ.3 లక్షల ఫీజు నిర్ణయించడంపై సోమవారం నాడు పిటిషనర్ అనిల్ కుమార్ అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. లాటరీలో మద్యం లైసెన్స్ దక్కకపోతే రూ.3 లక్షలు ఎక్సైజ్ శాఖకే వెళ్తాయని పిటిషనర్ తెలిపారు. మద్యం షాపు దక్కకపోతే దరఖాస్తు ఫీజు తిరిగి చెల్లించేలా ఎక్సైజ్ శాఖను ఆదేశించాలని హైకోర్టును కోరారు. అంతేకాకుండా లిక్కర్ పాలసీపై జారీ చేసిన జీవో 93ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ పై ఎక్సైజ్ శాఖ కమిషనర్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్సు కేటాయింపు కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. రాష్ట్రంలో 2620 మద్యం దుకాణాలకు లైసెన్సుల కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. గతంలో లైసెన్స్ ఫీజు రూ.2 లక్షలు ఉండేది. అయితే దీన్ని ఈ ఏడాది రూ.3 లక్షలకు పెంచారు. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అక్టోబర్ 23న డ్రా తీసి మద్యం లైసెన్సులను కేటాయిస్తారు. మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఎక్సైజ్ శాఖకు ఆరు విడతల్లో ఫీజు చెల్లించాలి. మద్యం దుకాణం లైసెన్స్ ను డ్రాలో పొందిన వారు అక్టోబర్ 24లోపు తొలి విడత డిపాజిట్ చెల్లించాలి. కొత్త మద్యం దుకాణాలు 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు ఉంటాయి. మద్యం దుకాణాల్లో ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం, గీత కార్మికులకు 15 శాతం రిజర్వేషన్లు కేటాయించారు.