ప్రజాదర్బార్ కు వినతుల వెల్లువ

హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కు వినతులు వెల్లువెత్తాయి. విజ్ఞాపన పత్రాలతో ప్రజలు భారీగా తరలివచ్చారు

  • Publish Date - December 11, 2023 / 03:17 PM IST

– అర్జీలు స్వీకరించిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

– ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుందని హామీ

– దరఖాస్తులపై అడ్రస్, సెల్ నంబర్, వివరాలు రాయాలని సూచన

విధాత: హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కు వినతులు వెల్లువెత్తాయి. విజ్ఞాపన పత్రాలతో ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజాదర్బార్ కు వచ్చిన ప్రజల సమస్యలు తెలుసుకుని వారి నుంచి వినతులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డీ శ్రీధర్ బాబు స్వీకరించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు తమ విజ్ఞాపనపత్రంలో సమస్యతో పాటు అడ్రస్, ఫోన్ నంబర్ రాయాలని సూచించారు. తద్వారా దరఖాస్తుదారుల సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించేందుకు వీలవుతుందని తెలిపారు. ఈనెల 17న నిర్వహించనున్న తెలంగాణ జెన్ కో ఏఈ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తిచేశారు. అదేరోజు రెండు, మూడు పరీక్షలు వున్నట్లు అభ్యర్థులు వివరించారు.


ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులతో చర్చించి పరీక్ష వాయిదాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తమకు ఇచ్చే గౌరవ వేతనాన్ని ప్రతి నెలా రెగ్యులర్ గా ఇవ్వాలని మధ్యాహ్న భోజన వంట కార్మికులు విజ్ఞాపన పత్రం అందజేశారు. ప్రజాదర్బార్ నిర్వహణను జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సమన్వయం చేశారు. ఆయుష్ విభాగం డైరెక్టర్ హరిచందన, సీనియర్ ఐఏఎస్ అధికారి ముషారఫ్ అలీ, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిసెట్టి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Latest News