తప్పిన భారీ ప్రాణ నష్టం
వారం రోజుల తర్వాతా వెలుగులోకి
బీఆరెస్ కమిషన్ల కక్కుర్తికి నిన్న మేడిగడ్డ..నేడు సుంకిశాల కూలిందన్న కాంగ్రెస్
కాంగ్రెస్ నిర్లక్ష్యమేనన్న బీఆరెస్
విధాత, హైదరాబాద్ : నాగార్జునసాగర్ జలాశయంలో డెడ్‌స్టోరేజీకి దిగువన నీటి మట్టంలోనూ హైదరాబాద్‌కు కృష్ణాజలాల తరలింపు కోసం చేపట్టిన సుంకిశాల టన్నెల్ పంప్‌హౌజ్ రిటెయినింగ్(రక్షణ గోడ) వాల్ కూలిపోయిన ఘటన సంచలనంగా మారింది. అదృష్టవశాత్తు రిటెయినింగ్ వాల్ కూలిన సమయంలో కూలీలు షిఫ్ట్ మారే సమయం కావడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. సుంకిశాల పంప్‌హౌజ్ లోకి సొరంగాల్లోకి సాగర్ జలాలు రాకుండా ఉండేందుకు రక్షణగా నిర్మించిన కాంక్రీట్ రిటెయినింగ్ వాల్ ఒక్కసారిగా కుప్పకూలడంతో సుంకిశాల పంపుహౌస్ నీట మునిగింది. నిత్యం వందమందికిపైగా కూలీలు పని చేస్తున్న నిర్మాణం తమకళ్లముందే రక్షణ గోడ కూలీ నిమిషాల్లో పంప్‌హౌజ్ జలమయమైన దృశ్యాలను చూసి కూలీలు తాము పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న వైనాన్ని తలుచుకుని భీతిల్లిపోయారు. ఈ ప్రమాదం ఆగస్టు 1వ తేదీన జరిగినప్పటికి జలమండలి అధికారులు రహస్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తుంది. ప్రమాదం జరగడానికి ఇంజనీర్ల అవగాహాన, అంచనా వైఫల్యమే కారణమన్నవిమర్శలు వినిపిస్తున్నాయి.
ఒకవైపు నాగార్జున సాగర్‌కు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటం, ప్రమాద సమయంలో 528అడుగుల నీటి మట్టం ఉండటం..ఎగువ నుంచి భారీగా వరద వస్తున్న సమయంలో 462-580 అడుగుల స్థాయిలో ఉండే సొరంగంలో గేటు అమర్చి, పూర్తిస్థాయిలో ఓపెన్ చేయడం వల్లనే జలాల ఒత్తిడికి సొరంగం గేటు, రక్షణ గోడ తట్టుకోలేకపోయాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాద ఘటనతో సుంకిశాల పంప్‌హౌజ్ జలమయమమైన నేపథ్యంలో ఇక వేసవి వచ్చేదాకా పనులు సాధ్యంకావంటున్నారు. గత ప్రభుత్వం కమిషన్లకు కక్కుర్తి పడి ఫౌండేషన్ నాణ్యత లేకుండా రిటెయినింగ్ వాల్ నిర్మించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, దీంతో తెలంగాణ ప్రజల సంపద వృధా అయ్యిందని, ఇదంతా మన మెగా కన్‌స్ట్రక్చన్ మహత్యమని, మేడిగడ్డ కూలినట్లుగానే సుంకిశాల పంప్ హౌస్ సేఫ్టీ వాల్ కూలిపోయిందని, సుంకిశాల పథకం కోసమే ఎస్‌ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టును పడేయించారని కాంగ్రెస్ విమర్శలకు దిగింది. అయితే గత ఏడాది డిసెంబర్ వరకు పనులు జరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు మందకొడిగా సాగుతూ సరైన పర్యవేక్షణలేకనే ప్రమాదం జరిగిందని బీఆరెస్ వర్గాలు విమర్శిస్తున్నాయి.
బీఆరెస్ హయంలోనే సుంకిశాల నిర్మాణ పనులు
హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం జలమండలి రోజుకు 270 మిలియన్ గ్యాలన్ల కృష్ణాజలాలను తరలిస్తున్నది. ఇందుకోసం నాగార్జునసాగర్ నుంచి జలాలను ఏఎమ్మార్పీ ద్వారా అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు ఎత్తిపోయడం కొనసాగుతుంది అక్కడి నుంచి కోదండాపూర్ వద్ద నిర్మించిన నీటిశుద్ధి కేంద్రంలో శుద్ధి చేసిన తర్వాత పైప్‌లైన్ల ద్వారా నగరానికి తరలిస్తారు. అయితే నాగార్జునసాగర్‌లో కనీసంగా 510 అడుగుల నీటిమట్టం ఉంటేనే ఏఎమ్మార్పీ మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోయడం సాధ్యమవుతుంది. అందుకే తరచూ వేసవిలో అత్యవసర మోటర్ల ద్వారా నీటిని పంపింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు నాగార్జునసాగర్ జలాశయ డెడ్‌స్టోరేజీకి దిగువకు సుమారు 492 అడుగుల నీటిమట్టం నుంచి కూడా జలాలను తరలించేందుకు వీలుగా సుంకిశాల పథకాన్ని చేపట్టారు.
తొలుత ఈ పథకాన్ని 1980 దశాబ్ధంలో తెరపైకి తీసుకొచ్చినప్పటికి ఎస్‌ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టు, ఏఎమ్మార్పీ ఎత్తిపోతలల రూపకల్పనతో సుంకిశాల తెరమరుగైంది. 1983లో ఏఎమ్మార్పీని మొదలు పెడితే 2004లో ఎస్‌ఎల్బీసీ పనులను ప్రారంభించారు. సుంకిశాల పథకాన్ని పక్కనపెట్టిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఎస్‌ఎల్బీసీ పథకం ఆలస్యమవుతుందన్న ఆలోచనతో 2001-03లో ఏఎమ్మార్పీ ఎత్తిపోతల పనులకు శ్రీకారం చుట్టి నగరానికి కృష్ణాజలాల తరలింపు మొదటి దశ పనులను పూర్తి చేశారు.అనంతరం మరో రెండు దశలు పూర్తయ్యాయి. ఆసియా ఖండంలో అతి ఎత్తైన ఎత్తిపోతల పథకంగా దీనికి పేరు వచ్చింది. ఏఎమ్మార్పీ నిర్వహణా భారం కూడా ఎక్కువగా ఉండడంతో ఎస్‌ఎల్బీసీ సొరంగం శాశ్వత పరిష్కార మార్గమని భావించారు. అయితే బీఆరెస్ ప్రభుత్వం 2022 సంవత్సరంలో రూ.2,215 కోట్లతో సుంకిశాల పథకం పనులు మొదలు పెట్టించింది.
ప్రమాదాన్ని అంచనా వేయలేని ఇంజనీర్లు
నాగార్జునసాగర్ డెడ్‌స్టోరేజీ నుంచి సొరంగ మార్గం ద్వారా సుంకిశాల వద్ద నిర్మించిన పంపుహౌజ్ వరకు నీటిని తరలించి, అక్కడ మోటర్లతో లిఫ్టు చేసి, పైప్‌లైన్ల ద్వారా కోదండాపూర్ వరకు జలాలను తరలించడమనేది ఈ పథకం లక్ష్యం. నాగార్జునసాగర్‌లో నీటిమట్టం ఆధారంగా తెరిచేందుకుగాను మూడు స్థాయిల్లో (ఒక్కో లెవల్‌లో ఒక్కోటి చొప్పున) మూడు సొరంగ మార్గాలను నిర్మించారు. అయితే మొత్తం పథకం పనులు పూర్తయి, మోటర్లను బిగించిన తర్వాత సొరంగాలను వంద శాతం పూర్తి చేస్తారు. అప్పటివరకు నాగార్జునసాగర్ వైపు కొంతమేర తవ్వకుండా వదిలెస్తారు. తద్వారా సాగర్‌లోని నీళ్లు సొరంగంలోకి రాకుండా ఉంటాయి. అదేవిధంగా సొరంగాల ద్వారా పంపుహౌజ్‌లోకి నీళ్లు వచ్చే ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యగా భారీస్థాయి రక్షణ గోడ (రిటెయినింగ్ వాల్) నిర్మించారు.
ఇప్పటికే పథకంలో భాగంగా సుంకిశాల నుంచి కోదండాపూర్ వరకు పైప్‌లైన్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. జలాశయంలో ఎనిమిది మీటర్ల వ్యాసంతో సొరంగ నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. 82 మీటర్ల లోతులో ఉన్న పంపుహౌజ్‌లో మోటర్ల ఏర్పాటుకుగాను ప్రాథమిక పనులను ఇటీవల మొదలుపెట్టారు. రానున్న రెండు నెలల్లోనే కొన్ని మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోయాలనే ఉద్దేశంతో అధికారులు పది, పదిహేను రోజుల కిందట మధ్యస్థాయిలో ఉన్న సొరంగంలో రక్షణగోడకు వెనక భాగాన గేట్‌ను అమర్చారు. ఎలాగూ గేటు, రక్షణ గోడ ఉన్నదనే భావనతో ఆ సొరంగాన్ని పూర్తిస్థాయిలో ఓపెన్ చేశారు. దీంతో సాగర్‌లో రోజురోజుకీ నీటిమట్టం పెరుగుతుండటంతో గేటుపై జలాల ఒత్తిడి తీవ్రమైంది. సొరంగంలో నుంచి కృష్ణాజలాలు వేగంగా వచ్చి గేటును తన్నుకొని, రక్షణ గోడను కూల్చి పంపుహౌజ్‌ను ముంచెత్తాయి. ఈ పరిణామాన్ని ఇంజినీర్లు సరిగ్గా అంచనా వేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పంపుహౌజ్‌లో ప్రస్తుతం మోటర్ల బిగింపునకు సంబంధించిన సివిల్ పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం పంపుహౌజ్‌లో వందమందికిపైగా కార్మికులు మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీన ఉదయం ఆరు గంటలకు వందమందికిపైగా కార్మికులు షిఫ్టు ముగించుకొని పంపుహౌజ్ నుంచి వాహనంలో బయటికి వస్తున్నారు. వారు పంపుహౌజ్ నుంచి బయటికి వచ్చిన సమయంలోనే పెద్ద పెద్ద శబ్దాలతో ఒక్కసారిగా రక్షణ గోడ కుప్పకూలిపోయింది వారి స్థానంలో పనికి వచ్చే వారు ఇంకా రాలేదు. అర గంట ముందైనా, తర్వాతనైనా ఈ ఘటన జరిగి ఉంటే ప్రాణ నష్టం భారీగా ఉండేదని ప్రత్యక్షసాక్షి ఒకరు చెప్పారు. కండ్ల ముందే రక్షణ గోడ కుప్పకూలి పంపుహౌజ్ మొత్తం జలమయం అయిందని తెలిపారు. అప్పటికే అందులో ఒక భారీ క్రేన్, టిప్పర్లు, ఇతర పరికరాలు ఉన్నట్టు తెలిసింది. దీంతో రూ.కోట్లల్లోనే నష్టం వాటిల్లింది.