TELANGANA | డ్రగ్స్‌ కేసులో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సోదరుడు అమన్‌ప్రీత్‌సింగ్‌ అరెస్ట్‌

మాదక ద్రవ్యాల కేసులో ప్రముఖ సినీ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సోదరుడు అమన్‌ప్రీత్‌సింగ్‌ను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పోలీసులు ధృవీకరించారు

  • Publish Date - July 15, 2024 / 07:44 PM IST

హైదరాబాద్‌ : మాదక ద్రవ్యాల కేసులో ప్రముఖ సినీ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సోదరుడు అమన్‌ప్రీత్‌సింగ్‌ను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పోలీసులు ధృవీకరించారు. సైబరాబాద్‌ పోలీస్‌ పరిధిలోని నార్కొటిక్స్‌ బ్యూరో, రాజేంద్రనగర్‌ ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అమన్‌ప్రీత్‌సింగ్‌ను అరెస్టు చేసినట్టు చెప్పారు. మరో ఐదుగురు వ్యక్తులను కూడా డగ్స్‌ సరఫరా చేసినందుకు అరెస్టు చేశామని పేర్కొన్నారు. అయితే.. అమన్‌ప్రీత్‌సింగ్‌ పేరు మాదక ద్రవ్యాలు వినియోగించిన 13 మంది జాబితాలో ఉన్నది. అతడికి పరీక్షలు నిర్వహించగా డగ్స్‌ వాడినట్టు తేలింది. త్వరలో అతడిని కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. అరెస్టయినవారిలో భారతీయులతో పాటు కొందరు నైజీరియన్లు కూడా ఉన్నారని పేర్కొన్నారు. వారిలో కొందరు పదేపదే ఈ నేరానికి పాల్పడ్డవారు ఉన్నారని పత్రికా ప్రకటనలో తెలిపారు. అమన్‌ సినీ నటుడని ధృవీకరించుకున్నామని, అయితే, టాలీవుడ్‌ నటుడా? లేక ఇతర సినీ పరిశ్రమల వ్యక్తా? అనేది అతడు చెప్పలేదని పేర్కొన్నారు.

డ్రగ్స్‌ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్‌ అంశంలో గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ కసారి రకుల్‌ప్రీత్‌ను విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ కేసులో ఆమెను విచారిస్తున్నారా? అన్న ప్రశ్నకు ‘రకుల్‌ప్రీత్‌కు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. ఆమెను మేం విచారించడం లేదు. ఈ కేసులో ఆమె పేరును లాగడం సరికాదు కాబట్టి ఈ విషయంలో ఏమీ వ్యాఖ్యానించేది లేదు’ అని పోలీస్‌ అధికారులు బదులిచ్చారు.

ఈ కేసులో 199 గ్రాముల కొకైన్‌, రెండు పాస్‌పోర్టులు, 2 బైక్‌లు, పది మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఓనువోహా బ్లెస్సింగ్, అజీజ్ నోహామ్ అడెశోల, అల్లా సత్య వెంకట గౌతమ్, సానబోయిన వరుణ్ కుమార్, మహ్మద్ మహబూబ్ షరీఫ్‌లను అరెస్టు చేయగా, డివైన్ ఎబుకా సుజీ, ఎజియోనిలీ ఫ్రాంక్లిన్ ఉచెన్నా పరారీలో ఉన్నారు. డ్రగ్స్‌ తీసుకున్నవారి పేర్లను కూడా పోలీసులు ప్రకటించారు. వీరంతా సంపన్న కుటుంబాలకు చెందనివారని, తెలంగాణలో డగ్స్‌ ను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. డ్రగ్స్‌ సరఫరాకు వీరంతా ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. 13 మంది డ్రగ్స్‌ తీసుకున్నట్టు తేలగా.. అందులో ఐదుగురు దొరికారని, వారందరికీ పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు.