Kodangal | రేవంత్ పర్యటనలో ఉద్రిక్తత.. ట్రాఫిక్ నిలిపివేతపై ప్రజల ఆగ్రహం

దసరా పండుగ రోజున సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనలో ఉద్రిక్తత. ట్రాఫిక్ నిలిపివేతపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. “మీకు దండం పెడతాం.. కాసేపు ఓపిక పట్టండి” అంటూ ప్రజలను శాంతింపజేసిన పోలీసు అధికారి.

Kodangal Tense as CM Revanth Reddy Visit Sparks Traffic Chaos

Kodangal Tense as CM Revanth Reddy Visit Sparks Traffic Chaos

హైదరాబాద్‌, అక్టోబరు 2 (విధాత బ్యూరో):
దసరా పండుగ రోజున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వస్థలమైన కొడంగల్‌కి వచ్చిన సందర్బంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయన రాక సమాచారంతో గురువారం రాత్రి పరిగి–కొడంగల్ చౌరస్తా వద్ద పోలీసులు ట్రాఫిక్‌ను గంటల తరబడి నిలిపివేశారు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పోలీసులపై మర్లబడ్డారు. “సీఎం డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేశారు.

“ఇప్పటికే గంట అయింది.. రేవంత్ రెడ్డి కోసం ఇంకా ఎంతసేపు ఆపుతారు? పండుగ రోజున ప్రజలను ఇలా ఇబ్బంది పెట్టడం సరైందా?” అంటూ వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాహనదారులు మండిపడ్డారు. రాత్రి 10 గంటలు దాటినా ట్రాఫిక్‌ను వదలకపోవడంపై గట్టిగా నిలదీశారు.

ఈ సందర్భంగా విధుల్లో ఉన్న ఓ ఉన్నతాధికారి జనం ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారు. “మీకు దండం పెడతాం.. మేమూ అన్నీ వదిలి రోడ్డుపైనే నిలబడ్డాం.. కాసేపు ఓపిక పట్టండి” అని వేడుకున్నారు. అయినా కూడా ఆగ్రహం తగ్గని ప్రజలు సీఎం పై నిరసన నినాదాలు కొనసాగించారు.

దీన్ని వీడియో తీసిన కొందరు సోషల్​మీడియాలో షేర్​ చేయగా, వెంటనే వైరల్ అయింది. ప్రముఖుల రాక కోసం ప్రజలను గంటల కొద్దీ ఇబ్బందిపెట్టడం సరైందికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version