RS Praveen Kumar : మంత్రులా..మాఫియా డాన్‌లా?

సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్‌ను 'మాఫియా డాన్ల కేబినెట్' అంటూ బీఆర్‌ఎస్ నేత ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ వివాదంలో రోహిన్ రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా మారారని ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కోరతామన్నారు.

RS Praveen Kumar

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రుల స్ధానంలో మాఫియా డాన్లు ఉన్నారని..అది మంత్రుల కేబినెట్ కాదు..మాఫియా డాన్ల కేబినెట్ అంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ వివాదం..కొండా సుస్మిత ఆరోపణలపై ఆయన మీడియా సమావేశంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పదేళ్లు కేసీఆర్ హయాంలో గొప్ప సంక్షేమ, అభివృద్ధి పాలన చూసిన తెలంగాణ రాష్ట్ర పరిస్థితి కుక్కలు చింపిన విస్తారకులా అవుతుందని ఎవరూ అనుకోలేదు అన్నారు. అవినీతిలో వాటాల కోసం మంత్రులు బహిరంగంగా కొట్లాడుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు దుకాణాలు తెరుచుకుని ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ నిజాలు చెప్పిందని అన్నారు. సీఎం రేవంత్ అనుచరుడు రోహిన్ రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా మారారని విమర్శించారు. రోహిన్ రెడ్డి ఆఫీస్‌లోనే తుపాకీ పెట్టి బెదిరించటమే ఇందుకు నిదర్శనమన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కోరనున్నట్లు తెలిపారు. డెక్కెన్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళను బెదిరించిన వెపన్ ఎవరిదో విచారించాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన అనుచరుడు రోహిన్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాల్ డేటా బయటకు తీస్తే దొంగల ముఠా బయటకు వస్తుందన్నారు.

రాష్ట్రాన్ని పాలిస్తుంది మీనాక్షి నటరాజనా? రేవంత్ రెడ్డినా? అని ప్రశ్నించారు. కమీషన్ పంపకాల్లో తేడా రావటం వల్లనే.. మంత్రుల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయంటూ వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఇంటికి వెళ్ళి సుమంత్ అనే నిందితుడిని పట్టుకురాలేని పరిస్థితి వచ్చిందన్నారు. అసలు రోహిన్ రెడ్డికి, సుమంత్‌కి ఏం సంబంధం అని, అసలు తల మీద పిస్టల్ పెట్టి పంచాయితీలు చేసుడు ఏంది.. అసలు ఒక సివిలియన్ చేతులోకి పిస్టల్ ఎలా వచ్చిందని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. మంత్రి మనిషి గన్‌తో బెదిరిస్తే కూడా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు, నిందితులను ఎందుకు అదుపులోకి తీసుకోలేదని నిలదీశారు. డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎపిసోడ్‌పై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. తనను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆర్మీ జవాన్ చెప్పినా.. ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని మండిపడ్డారు. స్థానిక ఏసీపీ తిరుపతి రెడ్డి ఫిర్యాదు తీసుకోవటం లేదని ఆర్మీ జవాన్ స్వయంగా చెప్తున్నారన్నారు. సామాన్యులకు ఒక న్యాయం.. మంత్రులకు మరొక న్యాయమా? అని నిలదీశారు.